టోక్యో : ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న బాంబు దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాలో కాల్పుల విరమణకు పిలుపివ్వకుండా జి-7 దేశాలు దూరం పాటించాయి. కానీ మానవతా సాయం కోసం కాల్పుల విరమణకు కాస్తంత విరామాలు కల్పించేందుకు, మానవతా కారిడార్ల ఏర్పాటు చేయడానికి మద్దతు తెలిపాయి. ఇక్కడ సమావేశమైన జి-7 దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు. అలాగే రష్యాతో యుద్ధం జరుపుతున్న ఉక్రెయిన్‌కు కూడా తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఘర్షణ విషయంలో రష్యాకు మద్దతివ్వరాదంటూ చైనాకు విజ్ఞప్తి చేశారు. ''గాజాలో దిగజారుతున్న మానవతా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అత్యవసర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం వుందని మేం నొక్కి చెబుతున్నాం. మానవతా సాయం అందేందుకు వీలుగా కారిడార్‌లు ఏర్పాటు చేయడానికి, తాత్కాలికంగా కాల్పుల విరమణలకు మేం మద్దతిస్తున్నాం. బందీలను కూడా తక్షణమే విడుదల చేయాలి.'' అని సంయుక్త ప్రకటన పేర్కొంది. గత నెల 7వ తేదీన జరిగిన దాడులు వంటివి పునరావృతం కాకుండా నివారించేందుకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తనను కాపాడుకునేందుకు, తన ప్రజలను రక్షించుకునేందుకు ఇజ్రాయిల్‌కు హక్కు వుందంటూ జి-7 మంత్రులు పేర్కొన్నారు.