Nov 16,2022 08:27
  • శోకసముద్రంలో తెలుగు ప్రేక్షకులు
  • ప్రధానితో సహా ప్రముఖుల నివాళి

ప్రజాశక్తి- హైదరాబాద్‌, విజయవాడ బ్యూరోలు : తెలుగు సినిమాకు సాహసాన్ని, తెగువను పరిచయం చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ ఇక లేరు. టాలీవుడ్‌లో మొట్టమొదటి జేమ్స్‌బాండ్‌గా, మొట్టమొదటి కౌబారుగా ప్రేక్షకులను ఆలరించిన నటశేఖరుడు కన్నుమూశారు. డేరింగ్‌,డాషింగ్‌, డైనమిక్‌ పదాలకు నిలువెత్తు రూపంగా నిలిచిన వెండితెర అల్లూరి సీతారామరాజు మంగళవారం తెల్లవారుజామున శాశ్వత విశ్రాంతిలోకి జారుకున్నారు. పరిశ్రమకు ఎందరో కొత్తవారిని పరిచయం చేసి, కష్ట నష్టాల్లో తోడుగా నిలిచిన కృష్ణ తుదిశ్వాస విడిచారన్న సంగతి తెలియడంతో తెలుగు సినిమాలోకంతో పాటు ప్రేక్షకులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయనకు అంతిమ నివాళులర్పించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో 79 సంవత్సరాల ఘట్టమనేని ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆయన్ను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్ధనలు ఫలించలేదు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. కృష్ణ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు విశ్వభూషణ్‌ హరిచందన్‌, తమిళసై, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కృష్ణ నివాసానికి వెళ్లి భౌతికకాయంపై పుష్పగుఛ్చాలుంచి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు పరామర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మంత్రులు కెటిఆర్‌, తలసాని, పువ్వాడ అజరు, ప్రశాంత్‌ రెడ్డి, నటులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణ భౌతిక కాయాన్ని మంగళవారం మధ్యాహ్నాంనుండి గచ్చిబౌలి లోని స్టేడియంకు తరలించి అభిమానుల సందర్శనార్ధం ఉంచాలని తొలుత నిర్ణయించారు. అయితే, ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకుని నానక్‌రామ్‌గూడలోని నివాసం వద్దే ఉంచారు. రాత్రి 10.30 గంటల సమయంలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు అంతిమనివాళులర్పించడానికి తరలివస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకి కృష్ణ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. అక్కడ మధ్యాహ్నం 12.30 గంటలవరకు ఉంచి, ఆతరువాత మహాప్రస్థానంలో అంతిమక్రియలను నిర్వహిస్తారు.
 

                                                                               జీవన ప్రస్థానం..

1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. చిన్నప్పటి నుండి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. 1965లో కృష్ణ ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేష్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం, ఆ తరువాత సినీ నటి దర్శకురాలు విజయనిర్మలను వివాహాం చేసుకున్నారు. ఆయన ఇద్దరు భార్యలతో పాటు కుమారుడు రమేష్‌బాబు కూబా ఇటీవలే మరణించారు.
రాజకీయాలలో... సినిమాతెరపైనే కాకుండా రాజకీయాల్లోనూ కృష్ణ తనదైన ముద్ర వేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై అభిమానంతో 1984లో కాంగ్రెస్‌ పార్టీలో కృష్ణ చేరారు. 1989లో ఆ పార్టీ తరుఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ హత్యకు గురికావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
 

                                                                      నేడు హైదరాబాద్‌కు జగన్‌

కృష్ణకు అంతిమనివాళుర్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన కార్యక్రమం ఖరారైంది. ఉదయమే హైదరాబాద్‌కు చేరుకుని నివాళులర్పిస్తారని సిఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అంతకు మందు విడుదల చేసిన ప్రకటనలో కృష్ణ మృతి తెలుగు సినీరంగానికి తీరనిలోటని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
 

                                                                            సిపిఎం సంతాపం

కృష్ణ మృతి పట్ల సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కృష్ణ 340 సినిమాలకుపైగా చిత్రాల్లో హీరోగా నటించారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన అల్లూరి సీతారామరాజులాంటి దేశభక్తి సినిమాలను నిర్మించారని పేర్కొన్నారు. రాయలసీమకు కరువు వచ్చినప్పుడు సినీఇండిస్టీ జోలెపట్టి నిధులు వసూలు చేసిన సందర్భంలో ఒక బృందానికి నాయకుడిగా కృష్ణ ఉన్నారని తెలిపారు. ఉదార స్వభావుడిగా సినీ పరిశ్రమలో ఆయనకు పేరుందని పేర్కొన్నారు. మహేశ్‌బాబు తదితర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలంగాణ సిపిఎం కమిటీ కూడా కృష్ణ మృతికి నివాళులర్పించింది.
 

                                                           స్ఫూర్తివంతమైన చిత్రాలు తీశారు : పిఎన్‌ఎం

ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు డాక్టర్‌ గరికపాటి రాజారావు బృందంలో, ఆయన దర్శకత్వంలో నాటకాలు ప్రదర్శిస్తూ అనంతరం సినీ రంగంలోకి వెళ్లిన కృష్ణ పలు స్ఫూర్తివంతమైన చిత్రాలు తీశారని ప్రజానాట్యమండలి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.మంగరాజు, ఎస్‌.అనిల్‌ పేర్కొన్నారు.
 

                                                                    సినీ జగతికి కృష్ణ ధృవతార : సిపిఐ

సినీ జగతికి కృష్ణ ధృవతారని సిపిఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సినిమాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించారని వివరించారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
 

                                                     సినీరంగంలో సాహసోపేతమైన వ్యక్తి : కాంగ్రెస్‌

తెలుగుసినీ రంగంలో సాహసోపేతమైన వ్యక్తి సూపర్‌ స్టార్‌ కృష్ణని, ఆయన మరణం కాంగ్రెస్‌ పార్టీకి లోటని పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ తెలిపారు.