Nov 11,2022 07:52
  • శ్రీకాకుళం జిల్లాలోనే 62 వేల ఎకరాలకు నష్టం

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాకకు చెందిన పి.సత్యారావు ఎకరాన్నర విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు. సరిగ్గా పొట్ట దశ దాటి ఎన్ను వచ్చే సమయంలో సుడిదోమ సోకింది. నివారణకు రూ.700 విలువ గల క్రిమిసంహారక మందును మూడు పర్యాయాలు వాడారు. ఫలితం లేకపోగా పంటంతా వ్యాపించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే మండలం తాడివలసకు చెందిన కౌలు రైతు జి.వెంకటరావుది ఇదే పరిస్థితి. ఆయన నాలుగున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశారు. పంట ఏపుగా పెరుగుతున్న తరుణంతో సుడిదోమ ఆశించింది. రెండుసార్లు క్రిమి సంహారక మందులను ఉపయోగించారు. ఇప్పటికే ఎకరా విస్తీర్ణం మేర పంటకు నష్టం వాటిల్లింది. ఇంకా దోమపోటు నియంత్రణలోకి రాకపోవడంతో పంట దక్కదన్న తీవ్ర నిరాశ నిస్పృహలో కూరుకుపోయారు. ఇప్పటివరకు రూ.60 వేలు మదుపు పెట్టారు. కౌలు ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.12 వేలు చెల్లించాల్సి ఉండడంతో ఏం చేయాలో తోచక తల్లడిల్లిపోతున్నారు.
          శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 35.98 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో పంట కోతలు మొదలయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ మరో 15 నుంచి 20 రోజుల్లో కోతలు ప్రారంభం కానున్నాయి. పంట అత్యంత కీలక దశలో ఉన్న సమయంలో సుడిదోమ సోకి రైతు వెన్ను విరిచేస్తోంది. సుడిదోమ దుబ్బులు అడుగున చేరి రసాన్ని పీల్చేస్తుండడంతో దోమ వ్యాపించిన ప్రాంతమంతా పంట ఎండిపోతోంది. క్రిమి సంహారక మందుల కోసం రైతులు ప్రయివేట్‌ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. సుడిదోమ నివారణ మందులను వినియోగిస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు.
 

                                                       శ్రీకాకుళం జిల్లాలోనే 62 వేల ఎకరాలకు నష్టం

సుడిదోమతో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 62.5 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 12.5 వేల ఎకరాల్లో పంట పూర్తి దెబ్బతింది. మరో 50 వేల ఎకరాల్లో పాక్షికంగా నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా వరకు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, ప్రస్తుతం పది నుంచి 12 క్వింటాళ్లకు మించి ధాన్యం రాదని రైతులు వాపోతున్నారు. సుడిదోమ సోకిన పంట పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్టోబరులో కురిసిన వర్షాలు, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో సుడిదోమ వ్యాప్తికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎరువుల కొరత వల్ల పొటాష్‌ తగినంతగా వాడకపోవడమూ మరో కారణంగా భావిస్తున్నారు. విత్తనం నుంచి ధాన్యం కొనుగోలు వరకు ఆర్‌బికెలు అంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం విపత్తు సమయంలో రైతుభరోసా కేంద్రాల నుంచి సబ్సిడీలపై ఉచిత మందులను పంపిణీ చేసే ఆలోచన చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుడిదోమతో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.