
ప్రజాశక్తి-సూళ్లూరుపేట :సూర్యుని చుట్టూ వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు రూపొందించిన 'ఆదిత్య ఎల్-1' శ్రీహరికోట షార్ నుంచి శనివారం ఉదయం 11.50 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. ప్రయోగం అనంతరం 63 నిమిషాల 30 సెకండ్ల తరువాత ఆదిత్య ఎల్-1 మిషన్‌ను నిర్దిష్ట కక్షలో పిఎస్‌ఎల్‌వి సి-57 రాకెట్ వదిలిపెట్టింది. 1475 కిలోల బరువు కలిగిన ఈ మిషన్ సూర్యుని సమీపానికి చేరుకోవడానికి సుమారు 125 రోజుల సమయం పడుతుంది. ఆదిత్య ఎల్-1లోని ఏడు పే లోడ్స్‌లో నాలుగు నేరుగా సూర్యునిపై పరిశోధనలు చేస్తాయి. మిగిలిన మూడు సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలపై పరిశోధనలు జరపనున్నాయి. ఐదు పే లోడ్స్‌ను ఇస్రో సారథ్యంలో, రెండు భారతీయ విద్యాసంస్థల ద్వారా రూపొందించారు. ఆదిత్య ఎల్-1 మిషన్ 16 రోజుల పాటు భూ కక్షలో తిరుగుతూ ఉంటుంది. భూమి చుట్టూ నాలుగుసార్లు తిరిగిన తరువాత సూర్యుని వైపుకు ప్రయాణిస్తుంది. ఆదిత్య ఎల్-1 లాంచింగ్ విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. రాకెట్ నుంచి ఆదిత్య ఎల్-1 విజయవంతంగా విడిపోయిందని.. దానిని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
- శాస్త్రవేత్తలకు ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు
ఆదిత్య ఎల్-1ను విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. 'చంద్రయాన్ -3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తున్నది. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహన పెంపొందించడానికి అవిశ్రాంతంగా శాస్త్రీయ ప్రయత్నాలు కొనసాగుతాయి' అని మోడీ ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా 'భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్యఎల్-1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం అయినందుకు నా శుభాకాంక్షలు' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.