Nov 06,2023 11:03
  • పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
  • రంపచోడవరం ఏజెన్సీలో ఉత్సాహంగా బస్సు యాత్ర

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, రంపచోడవరం విలేకరి : అల్లూరి సీతారామరాజు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించి కనీస సదుపాయాలు కల్పించాలని ప్రజారక్షణ భేరి డిమాండ్‌ చేసింది. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర ఏడో రోజుకు చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు, విఆర్‌.పురం, కూనవరం, ఎటపాక మండలం తోటపల్లిల్లో ఆదివారం జరిగిన బహిరంగ సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు. అడవిలోని వనరులు, ఖనిజాలు, భూమిపై ప్రభుత్వానికి ప్రేమ తప్ప, గిరిజనులపై లేదన్నారు. అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించి గిరిజనుల చేతిలోని భూములను, సహజ సంపదను లాక్కొని అదానీ వంటి వ్యక్తులకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం తెస్తోన్న గిరిజన వ్యతిరేక చట్టాలకు వైసిపి, టిడిపి మద్దతు ఇస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. సిపిఎం ఎమ్మెల్యేలు ఉన్న కాలంలో తప్ప, ఆ తరువాత విలీన మండలాల్లో అభివృద్ధి జరగలేదని అన్నారు. గిరిజన ప్రాంతంలోని వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని, గిరిజన హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. పునరావాసం పూర్తి స్థాయిలో కల్పించే వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టు లీకేజీలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, భాషా వలంటీర్లను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పునరావాసం సాధన కోసం నిర్వాసితులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, అశోక్‌, రాష్ట్ర నాయకులు ఎం సూర్యనారాయణ, రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

praja rakshana bheri

                                                 ఉత్తేజంగా సాగిన యాత్ర... అమరులకు నివాళి

రంపచోడవరం ఏజెన్సీలో ప్రజారక్షణ భేరి యాత్ర ఉత్తేజంగా సాగింది. విఆర్‌.పురం మండలం చొప్పల్లి గ్రామం వద్ద ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి యాత్రా బృందం బైకు ర్యాలీగా సున్నంవారి గూడేనికి చేరుకుంది. అక్కడ సిపిఎం మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు సున్నం రాజయ్య స్తూపం వద్ద వి.శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. చింతూరులో సిపిఎం నాయకులు బత్తుల భీష్మారావు వర్థంతి కార్యక్రమంలో యాత్రా బృందం పాల్గొంది. ఆయన స్మారక స్తూపం వద్ద నివాళ్లర్పించింది. మండల కేంద్రంలోని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌, మల్లుదొర, గంటం దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

                                           రంపచోడవరం ప్రత్యేక జిల్లా : వి శ్రీనివాసరావు డిమాండ్‌

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేయాలని వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజారక్షణ భేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌తో కలిసి రంపచోడవరంలో విలేకరులతో మాట్లాడారు. రంపచోడవరం నియోజకవర్గంలోని ప్రజలు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు వెళ్లాలంటే రహదారి, రవాణా సౌకర్యం సరిగా లేవన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన అల్లూరి జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. వందల కోట్లు ఖర్చు చేసి జాతీయ రహదారి నిర్మిస్తోన్న ప్రభుత్వం... గిరిజన గ్రామాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించకపోవడం విచారకరమన్నారు. ఏజెన్సీలో జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడం సరికాదని తెలిపారు. అల్లూరి పేరుకు అపచారం చేసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. ఏజెన్సీలో జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా ఆస్పత్రుల్లో సరిపడా వైద్య సిబ్బంది లేక కాకినాడ, విశాఖపట్నం ఆస్పత్రులకు రోగులు వెళ్లాల్సిన దుస్థితి ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏజెన్సీలో అమలు కావడం లేదన్నారు. కాఫీ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం రావాల్సిన రైతుకు రూ.40 వేలు మించి రావడం లేదని తెలిపారు. ప్రయివేటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్రస్తుత రేట్ల ప్రకారం పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో వనరులను కొల్లగొట్టుకుపోవడాన్ని పోరాటాలతో అడ్డుకుంటామన్నారు. బాక్సైట్‌ తవ్వకం కోసం, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులను అదానీకి అప్పగించడం కోసం జరుగుతున్న ప్రయత్నాలను సాగనివ్వబోమని తేల్చి చెప్పారు.