ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సబ్ జూనియర్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలు మంగళవారం నాడు అనంతపురం నగరంలోని ఆర్‌డిటి మైదానంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆల్ ఇండియా పుట్‌బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పోటీలు అక్టోబరు 10వ తేదీ వరకు జరగనున్నాయి. దేశంలోని 19 రాష్ట్రాల నుంచి బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి, ఎపి పుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్, ఆర్‌డిటి ప్రాజెక్టు డైరెక్టర్ మంఛూ ఫెర్రర్‌లు ముఖ్య అతిథులుగా హాజరై మ్యాచ్‌లను ప్రారంభించారు.
దమ్ముదులిపిన అస్సాం
ఆర్‌డిటి మైదానంలో ప్రారంభమైన సబ్ జూనియర్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో మొదటి రోజు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో అస్సాం-హిమాచల్ ప్రదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అస్సాం టీమ్ ఏకంగా ఏడు గోల్స్ చేసి దుమ్ము దులిపింది. హిమాచల్ ప్రదేశ్ ఒక్క గోలైనా చేయలేకపోయింది. త్రిపుర-అండమాన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో త్రిపుర విజయం సాధించింది. త్రిపుర మూడు గోల్స్ సాధించగా అండమాన్ ఒక్క గోలైనా వేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్- సిక్కిం జట్లు, తమిళనాడు-బీహర్ జట్లు చెరో గోల్ వేయడంతో రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మొదటి రోజు జరిగిన మ్యాచుల్లో రెండు ఫలితం రాగా, రెండు డ్రాగా ముగిశాయి.










