
ఏ రోటి దగ్గర ఆ పాట లాగా సెంటిమెంటు అస్త్రంతో ఇక్కడ ఆంధ్రుల గొప్పతనాన్ని అక్కడ తెలంగాణ ప్రజల వారసత్వాన్ని పొగిడేసి మెప్పించే ప్రయత్నం చేశారు. తన సభ కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి జన సమీకరణ భారం కూడా మోసిన జగన్ సర్కారు జోలికి పోకుండా అక్కడ తన ప్రభుత్వ ఘనతలు చాటుకోవడంతో సరిపెట్టారు. అదే తెలంగాణకు వచ్చేసరికి ...అడుగు పెట్టినప్పటి నుంచి ఆఖరి వరకూ రాష్ట్ర ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రిపైనా దాడులకే పరిమితమయ్యారు. ఆపరేషన్ ఫామ్‌హౌస్ అరెస్టులు, మునుగోడు ఎదురుదెబ్బతో గుండె చెదిరిన రాష్ట్ర బిజెపి నేతలకు భరోసా ఇవ్వడానికి తంటాలు పడ్డారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగ, కార్మికుల అరెస్టుల మధ్య వేదికపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తిపై స్పందించలేదు గాని... తెలంగాణలో సింగరేణి గనుల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం జరుగుతున్నదంటూ హడావుడి చేశారు. మొత్తంపైన చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో పరస్పర విరుద్ధ పోకడలు కనిపించినా సారాంశం మాత్రం బిజెపి ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుడగలు, గొప్పలు చెప్పుకోవడంగానే పరిణమించింది.
ఎ.పి, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అధికార పర్యటన బిజెపికి అనధికార ప్రచార యాత్రగా పరిణమించింది. ఎ.పి లో వైఎస్‌ఆర్‌సిపి ఆయనకు బ్రహ్మరథం పడితే...తెలంగాణలో టిఆర్‌ఎస్, వామపక్షాల నిరసనతో అచ్చమైన బిజెపి యాత్రగానే మారింది. ఏ రోటి దగ్గర ఆ పాట లాగా సెంటిమెంటు అస్త్రంతో ఇక్కడ ఆంధ్రుల గొప్పతనాన్ని అక్కడ తెలంగాణ ప్రజల వారసత్వాన్ని పొగిడేసి మెప్పించే ప్రయత్నం చేశారు. తన సభ కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి జన సమీకరణ భారం కూడా మోసిన జగన్ సర్కారు జోలికి పోకుండా అక్కడ తన ప్రభుత్వ ఘనతలు చాటుకోవడంతో సరిపెట్టారు. అదే తెలంగాణకు వచ్చేసరికి...అడుగు పెట్టినప్పటి నుంచి ఆఖరి వరకూ రాష్ట్ర ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రిపైనా దాడులకే పరిమితమయ్యారు. ఆపరేషన్ ఫామ్‌హౌస్ అరెస్టులు, మునుగోడు ఎదురుదెబ్బతో గుండె చెదిరిన రాష్ట్ర బిజెపి నేతలకు భరోసా ఇవ్వడానికి తంటాలు పడ్డారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగ కార్మికుల అరెస్టుల మధ్య వేదికపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తిపై స్పందించలేదు గాని...తెలంగాణలో సింగరేణి గనుల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం జరుగుతున్నదంటూ హడావుడి చేశారు. మొత్తం పైన చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో పరస్పర విరుద్ధ పోకడలు కనిపించినా సారాంశం మాత్రం బిజెపి ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుడగలు, గొప్పలు చెప్పుకోవడంగానే పరిణమించింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అదనంగా తోడైంది. ఈ ఘట్టంలో ఆయనను ముందుకు తెచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తాను తెలంగాణలో తమ పార్టీ పునరుజ్జీవనంపై కేంద్రీకరించానంటూ మొహం చాటేశారు. రెండు చోట్ల వామపక్షాలు మాత్రం మోడీ విధానాలకు రాష్ట్రాల పట్ల ఆయన సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
ఎ.పి లో విన్యాసాలు
ముందుగా ఎ.పి సంగతి తీసుకుంటే ఈ సమయంలో మోడీ పర్యటన జగన్ సర్కారు విశాఖ రాజకీయాలకు సానుకూల సంకేతాలు ఇస్తుందనే అభిప్రాయం బలంగా వచ్చింది. మూడు రాజధానుల పేరిట సాగుతున్న ప్రహసనంలో ఈ నగరం కేంద్ర బిందువుగా వుంది. ఇటీవల పాలక పార్టీ ప్రేరణతో జరిగిన విశాఖ గర్జన, పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత చూశాం. జనసేన వారు మంత్రులపై దాడి చేయడం, ఆయన పర్యటన పట్ల పోలీసుల ప్రతికూలత తర్వాత ఆయన చెప్పు చూపిస్తూ ప్రసంగం చేయడం, చంద్రబాబు సంఘీభావంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమమంటూ ప్రకటించడం జరిగాయి. పోలీసుల వైఖరి, ప్రభుత్వం ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదంటూనే బిజెపిని వ్యతిరేకించకుండా వీరు ఎలా ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేయగలరనేది సహేతుకమైన ప్రశ్న. తెలుగుదేశం, జనసేన కలసి పోవడమే గాక బిజెపితో కూడా కూటమి ఏర్పాటు చేస్తాయని కథలు వినిపించాయి. బిజెపి, టిడిపితో సంబంధం వుండబోదని పవన్ మాత్రం తమతో వుంటాడని ఒకటికి రెండు సార్లు ప్రకటించింది. జగన్ కేంద్రంపై విమర్శలు చేయకుండా విధేయత ప్రదిర్శిస్తున్న నేపథ్యం వుండనేవున్నా రాజకీయంగా వంటరిగానే వుంటామని వైసిపి చెబుతూ వస్తున్నది. ఎ.పి రాజకీయంలో మూడు ప్రాంతీయ పార్టీలు తమలో తాము తిట్టుకుంటూ బిజెపికి మార్గం సుగమం చేస్తున్నాయనేది స్పష్టమైపోయింది. రాష్ట్రం కోసం కలసి కట్టుగా కేంద్రంపై పోరాడటమనే ప్రసక్తి లేకుండా పోయింది.
బాబు అదృశ్యం, పవన్ ఆశాభంగం
విశాఖ ఘటనల తర్వాత గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఘటనలు వేడిని మరింత పెంచాయి. పలు కేసులూ అసహన వివాదాలు కూడా నడుస్తున్నాయి. టిడిపి, జనసేన మధ్య సంబంధాలే గాక బిజెపి వాటిలో ఎవరితో వుంది లేదు అనే తర్జనభర్జనలూ పెరిగాయి. ఎందుకంటే ఆ రెండు పార్టీలూ జగన్ ప్రభుత్వ తప్పిదాలనే విమర్శిస్తూ కేంద్రం పోకడల గురించి రాష్ట్రాలపై దాడి గురించి మాట్లాడటమే మానేశాయి. పైగా అదంతా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనంటూ వాదిస్తున్నాయి. రామతీర్థం వంటి వివాదాలను పెంచడంలో బిజెపికి తీసిపోని విధంగా వ్యవహరించాయి. ఆ బిజెపి రోడ్ మ్యాప్ కోసం చూస్తే రాలేదు గనక తన వ్యూహం మార్చుకోవలసి రావచ్చని పవన్ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అన్ని పార్టీలనూ ఒక తాటిపైకి తెస్తానని పవన్ అంటుంటే చంద్రబాబు బిజెపి తమకు దగ్గరవుతున్నదనే కథనాలు ప్రచారంలో పెట్టారు. బిజెపి అధినేతలు జనసేనకే తమ పొత్తు పరిమితమని స్పష్టం చేస్తూ వచ్చారు. అమరావతి రాజధానిగా వుండాలనేది తమ విధానమని రాష్ట్రంలో బిజెపి నేతలతో చెప్పిస్తూనే కేంద్రం నుంచి, అత్యున్నత నాయకత్వం నుంచి ఆ సూచనలు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇవన్నీ బిజెపి ద్వంద్వ రాజకీయాలను, కపట నీతిని తెలియజెప్పే ఉదాహరణలు. అయినా మోడీపై బిజెపిపై ఎనలేని గౌరవం ప్రకటించిన పవన్ కళ్యాణ్‌తో బంధం అట్టిపెట్టుకోవడానికి కూడా నాయకత్వం ఈ పర్యటనను అవకాశంగా చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు (చంద్రబాబు ఈ తేదీలలోనే తన తెలంగాణ యాత్ర పెట్టుకున్నారు). ఆఖరి నిముషంలో మొక్కుబడిగా పవన్‌తో భేటీని పిఎంవో ఖరారు చేస్తే అదేదో మహత్తర ఘటనగా మీడియాలు కొన్ని ప్రచారం చేశాయి. పవన్‌నే ముఖ్యమంత్రిగా ప్రకటించి టిడిపి వైపు వెళ్లకుండా ఆపుతారని ఊహాగానాలు నడిచాయి. రాష్ట్ర ప్రభుత్వంపై అయిదు పేజీల నోట్ తయారు చేసుకుని వెళ్లిన జనసేనాని మోడీకి దాన్ని సమర్పించడం తప్ప పెద్దగా మాట్లాడినట్టు లేదు. స్పష్టత అంతకన్నా లేదు. 'రాష్ట్రానికి, తెలుగు వారికి మంచి రోజులు వస్తాయని' సినిమా పాట తరహాలో డైలాగు చెప్పి ఆయన వెళ్లిపోయారు. దాంతో ఇదంతా ప్రచారకాండేనని తేలిపోయింది. విశాఖ ఉక్కుపై జగన్ ను పదేపదే ప్రశ్నించిన పవన్ తాను ఆ ముక్కయినా ప్రస్తావించినట్టు ఇప్పటి వరకూ చెప్పలేదు. మొదట భారీ కథలతో చెలరేగి తర్వాత హతాశులైన మీడియా వెంటనే పవన్ ఇచ్చిన పత్రాల ఆధారంగా జగన్‌పై చర్యలు తప్పవని కొత్త పల్లవి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై, శాంతి భద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని పదేపదే కోరడం రాజ్యాంగ విరుద్ధమే గాక బిజెపికి పెత్తనమిచ్చే వైఖరి.
మోడీకి జగన్ బహిరంగ సంకేతాలు
ఇక శనివారం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో కవితలు, పాటల ఆధారంగా రాజధాని తరలి వస్తుందనే సంకేతాలు వదిలారు. తాము గతంలో ఇచ్చిన విజ్ఞప్తులు నెరవేర్చాలని కోరుతూ విశాఖ ఉక్కు, పోలవరం ప్రత్యేక హోదా వంటివి (తెలుగులో) ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇతర రాజకీయాలు తమకు అవసరం లేదంటూ మోడీతో ప్రత్యేక అనుబంధం నొక్కి చెప్పి జగన్ నమోనమ: అంటూ రెండు చేతులూ జోడించేశారు. పూర్తి కాని అంశాలు ఇన్ని వున్నాయంటున్న జగన్...ప్రత్యేక ప్రేమతో మోడీ ఎ.పి కి అన్నీ ఇచ్చేస్తున్నారని పొగడ్డం మరో విపరీతం. మోడీ మాత్రం ఆయన కోరిన వాటిపై పెదవి మెదపలేదు. దేశాన్ని తామెంత గొప్పగా పాలిస్తున్నామో, తెలుగువారెంత గొప్పవారో పొగిడి మురిపించేందుకు ప్రయత్నించారు. విశాఖ పట్టణం విశేష పట్టణం అంటూ సర్కారుకు సానుకూలత చూపించారు. విశాఖను చూస్తే వెంకయ్య నాయుడు, హరిబాబు గుర్తుకు వస్తారని తమ పార్టీ నేతలనే ప్రస్తావించారు తప్ప ఆఖరుకు తెన్నేటి విశ్వనాథం వంటివారినైనా తలవలేదు. పవన్ చెప్పినట్టు మంచి రోజులను సూచించే ప్రకటన ఒకటైనా చేయకుండానే హైదరాబాద్ బయిలుదేరారు.
కెసిఆర్‌పై యుద్ధ ప్రకటనే!
హైదరాబాద్‌లో దిగగానే మోడీ డబల్ ఫోటో మొదలైంది. తనను స్వాగతించేందుకు కెసిఆర్ రాలేదు గాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయం దగ్గరే తొలి ప్రసంగంతోనే కెసిఆర్ సర్కారుపై యుద్ధ ప్రకటన చేశారు. నిజాం సర్కారు లాంటి ఈ ప్రభుత్వానికి మర్యాద లేదన్నారు. తనను తిట్టినా పర్వాలేదు గాని తెలంగాణ ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హూంకరించారు. గవర్నర్‌ను అవమానించారన్నారు. ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వ అవినీతిని అంతం చేయకుండా వదిలేది లేదన్నారు. తెలంగాణలో బిజెపి నేతలకు ఇప్పటి చీకట్లు తొలగిపోయి కొత్త వెలుగులు వచ్చేస్తాయని, చీకట్ల మధ్యనే కమలం వికసిస్తుందని ఓదారుస్తూ ఆపరేషన్ ఫాం హౌస్ దెబ్బలకు మందు పూసే ప్రయత్నం చేశారు. మునుగోడులో తమ వాళ్లు బాగా పోరాడారంటూ పొగిడారు. ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి వెన్ను తట్టి మరీ భరోసా ఇచ్చారు. సింగరేణి కాలరీస్‌ను ప్రైవేటీకరిస్తామనేది దుష్ప్రచారమనీ, 51 శాతం వాటావున్న రాష్ట్రానికి తెలియకుండా తామేమీ చేయలేమని పదేపదే చెప్పారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా సింగరేణిపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెలరేగిపోయారు. తమాషా ఏమంటే బ్రహ్మాండమైన ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీక రణపై నోరు మెదపని ప్రధాని తెలంగాణలో అదేపనిగా ఆ సంగతి మాట్లాడ్డం.
రామగుండం కర్మాగారం కూడా ఏదాది కిందనుంచి పనిచేస్తూ బాగా లాభాలు ఆర్జించిన విషయం రాష్ట్ర ప్రభుత్వం లెక్కలతో సహా విడుదల చేసింది. ఇక మర్యాదల విషయానికి వస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటా వున్నా ముఖ్యమంత్రిని ప్రధాని కార్యాలయం సంప్రదించకుండా ఆ శాఖా మంత్రి సమాచారం మాత్రమే పంపడంలో కేంద్రం మర్యాదేంటో తెలుస్తుంది. నిజానికి రెండు రాష్ట్రాలలోనూ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు అంటూ ఊదరగొట్టడమే గాని వాస్తవంలో మూడో వంతు మాత్రమే పూర్తయిన పనులు. అది కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో! వీటిపై వదిలిన టీవీ యాడ్ ప్యాకేజీలలోనే ఈ సంగతి మనకు స్పష్టమవుతుంది. వీటితోనే ఏదో మహత్త రమైన మేలు జరిగిపోతున్నట్టు ఆర్భాటం చేయడం అర్థ రహితం. మరింత గట్టిగా పోరాడటమే అత్యవసరం. తెలుగు రాష్ట్రాలకూ దేశానికి కూడా అదొక్కటే మిగిలిన మార్గం.
తెలకపల్లి రవి