- టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి
- హాస్టళ్లల్లో మెరుగైన వసతులు కల్పించండి
- ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
ప్రజాశక్తి -యంత్రాంగం : ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు తక్షణమే పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో మెరుగైన వసతులు సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం ర్యాలీలు, కలెక్టరేట్, ఆర్‌డిఒ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
అనంతపురంలో విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టరేట్ గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, విద్యార్థులతో మాట్లాడాలని నాయకులు పట్టుబట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌తో పాటు పలువురిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.అనకాపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్‌లో మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.పావని తదితరులు పాల్గొన్నారు. విశాఖ కలెక్టరేట్ వద్ద, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. టీచర్లు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నించారు. కర్నూలులో కెవిఆర్, టౌన్ మోడల్ కళాశాలల నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా నిర్వహించారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన తెలియజేసి, అనంతరం స్పందనలో అధికారులకు అర్జీ అందచేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో తహశీల్దార్ కార్యాలయం ఆందోళన చేపట్టారు. కాకినాడలో సుందరయ్యభవన్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అప్‌గ్రేడ్ అయిన కళాశాలల్లో అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.