Feb 27,2023 07:49

వాళ్లంతా ఎటు వెళ్తున్నారు?
గుంపులు గుంపులుగా
ఎవరి ముఖాన్ని వారి అరిచేతుల్లో దాచుకొని
స్థైర్యం ధైర్యం ఆత్మవిశ్వాసం ఆనందం ఏమీలేక
భయం భయంగా తొందర తొందరగా
ధగధగమనే పగటి చీకటిలో
మూస కలల వెంట.. మూకలు మూకలుగా!

కాలేజీ క్యాంపస్సు క్యాంటీను
ప్లేగ్రౌండు లైబ్రరీ ఎక్కడ చూసినా వాళ్ళే..
బెల్లం కొట్టే రాళ్లలా!
పెద్ద పెద్ద మర్రిచెట్లలాంటి ప్రైవేటు క్యాంపస్సుల్లో
మాటిమాటికీ కళ్లద్దాలు సర్దుకొని
వేల పేజీల పుస్తకాలు
తలవాల్చి నడుస్తున్నట్టున్నాయి
నడుములు ఒంగిన లాప్టాపులు
అప్రోచ్‌ రోడ్డు పక్కన చెట్టు కింద బెంచీలో
కూలబడినట్టున్నాయి
ఎక్కడా కరెంటు తీగల్లాంటి విద్యుత్‌ చైతన్యం
మచ్చుకైనా లేదు
నిలువు బొట్టుతో నిశ్శబ్ధం రాజ్యమేలుతున్న చోట
ఏ కుర్ర ప్రశ్నల సవ్వడీ కనిపించడం లేదు

జడివానల్లా కూడికయ్యే పిడికిళ్లు
వరదల్లా పోటెత్తే దేహాలు
పిడుగుల్లా గర్జించే కంఠాలు
స్వేచ్ఛాకాశాలను ఆక్రమించే మబ్బుల్ని
ఎప్పటికప్పుడు మెరుపులై చెండాడే జెండాలు
ఇపుడేమైపోయాయి?

ఎటు చూసినా సెల్‌ ఫోన్లను
హిప్నటైజ్‌ చేస్తున్న చురుకు కళ్ళు..
కూలింగ్‌ గ్లాసులు పెట్టుకున్న బీరు బుడ్డీలు
ఒంటరొంటరిగా నడుస్తున్నట్టుంది
అసలు ఈ నేలనంతా వెలిగించాల్సిన వాళ్లు..
దోపిడీ కాలాలకు ఎదురు నిలబడి
భవిష్యత్తును దారి మళ్లించాల్సిన వాళ్ళు..
వాళ్ళేమయ్యారు?

గదిలోపలి గదిలోపలి గదిలోపలి
గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నట్టున్నారు
కిటికీలు కూడా మూసుకున్నట్టున్నారు
ఉద్యోగ బానిసత్వానికి సిద్ధపడి
కెరీర్‌ గదుల్లో తలదూర్చి మాయమైపోయారు

చల్లగా ఈ నేలనంతా
ఉల్లిబాములు నొళ్ళుకున్నాక గానీ
టీనేజర్లు ఈ నెత్తుటి నేలవంక చూసేలా లేరు!

- కంచరాన భుజంగరావు
94415 89602