నరేంద్రమోడీ పాలనలో దేశం ఎదుర్కుంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య అన్నారు. ఇటీవల నెల్లూరులో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభకు హాజరైన ఆమె ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ప్రస్తావించారు. మహిళలపై అణచివేత గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. కోవిడ్ అనంతరం అనేక కుటుంబాలు తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నాయని, అయినా మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా :
ప్ర: దేశవ్యాప్తంగా ఐద్వా ఎటువంటి కృషి చేస్తోంది?
జ: మహిళా సమస్యలపై ప్రధానంగా కృషి చేస్తున్నాం. అణచివేతకు వ్యతిరేకంగా, సమాన అవకాశాలకోసం పోరాడుతున్నాం. దీనిని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు స్థానికంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారో వారిని గుర్తిస్తున్నాం. అలాగే విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వారిని కూడా పరిశీలిస్తున్నాం. వివిధ రంగాల్లో మహిళలు చేస్తున్న కృషిని గుర్తిస్తున్నాం. వారినో పోరాటాల్లోకి తీసుకురావడానికి, ఐద్వాలో భాగస్వాములు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం,
ప్ర: ప్రజలను చీలుస్తున్న బిజెపి హిందూత్వ ప్రచారాన్ని, మత విద్వేషాలను ఎలా తిప్పికొట్టాలి?
జ: ఆరెస్సెస్‌కు బిజెపి తోకలాగా పనిచేస్తుంది. భారతదేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు వున్నా... అందరూ భారతీయులే. విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ప్రొఫెసర్లు ఏ మతానికి చెందినవారు కాదు. రాజకీయ లబ్ధికోసమే బిజెపి మతాన్ని అడ్టు పెట్టుకుంటోంది. బిల్కిస్‌బానో కానివ్వండి, హత్రాస్ దళిత మహిళ కానివ్వండి.. ఇతర ఘటనల్లో బాధిత మహిళలెవరైనా కుల, మతాలకు అతీతంగా... మహిళలపై జరిగే అన్యాయాలు, అకృత్యాలను ఎదుర్కోవాలి. మతవిద్వేషం స్థానంలో సమతా భావాన్ని పెంచాలి. ఈ కృషిలో మహిళలు అత్యంత కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. వారిని చైతన్య పరచడమే కీలకం.
ప్ర: నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలను మీరెలా చూస్తారు ?
జ: మన దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మోడీ అయినా, మమతాబెనర్జీ అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా వారిని పకోడీలు అమ్ముకోమని చెప్పడం దేనికి సంకేతం? కోటిమందికి ఉద్యోగాలిస్తామన్న మోడీ ప్రభుత్వం... పట్టుమని పది లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉపాధిలేక, జీవనోపాధికి ఎలాంటి ఆధారము లేకపోవడం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. హామీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యువత గళం విప్పాలి.
ప్ర: ఇటీవల కాలంలో మహిళలపై దాడులు, ఆంక్షలు పెరిగిపోతున్నాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలి ?
జ: మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలపై ఆంక్షలు పెరిగాయి. ఇటీవల హిజాబ్‌కి వ్యతిరేకంగా జరిగిన ఘటనల్ని చూశాము. ఇదే తినాలి, ఇవే కట్టుకోవాలి అనే ఆంక్షలు యువతపైనా, మహిళలపైనా పెరుగుతున్నాయి. ముస్లిం దేశమైన ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మహిళల చదువుపైనా, మాట్లాడడంపైనా, ఉద్యోగంపైనా, బట్టలపైనా ఆంక్షలు విధిస్తున్నారు. భారత్‌లోనూ మతాన్ని అడ్డం పెట్టుకుని స్త్రీలపై ఆంక్షలు పెడుతున్నారు. ఆప్ఘనిస్తాన్‌లో అయినా, భారత్‌లో అయినా... స్త్రీలపై జరుగుతున్న అమానవీయతను, నిర్బంధాలను. దాడులను తీవ్రంగా ఖండించాలి. ఈ అకృత్యాలకు వ్యతిరేకంగా మహిళలు కదలాలి. పోరాటం చేయాలి. హక్కుల్ని కాపాడుకోవాలి.










