ప్రజాశక్తి - ఎర్రగుంట్ల(కడప) : ఉద్యోగుల వేతన సవరణ, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్స్‌తో ఎపి విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ పిలుపు మేరకు ఆర్టీపీపీ పవర్ గేటు ఎదుట ఉద్యోగులు , కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఉదయం భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నపూస సుబ్బిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల వేతన సవరణ విషయంలో యాజమాన్యం తీరు దారుణంగా ఉందన్నారు. విద్యుత్ సంస్థల చరిత్రలో ఎప్పుడు కూడా వేతన సవరణ ఆలస్యం కాలేదన్నారు. 3డిఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంక్రెమెంట్స్ నిలుపుదల చేశారని దీని ఫలితముగా ఉద్యోగులు పదహారు మాసాలుగా ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని, కార్మికులకు మినిమం టైం స్కేల్, డైరెక్ట్‌గా విద్యుత్ సంస్థల యాజమాన్యాలే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇపిఎఫ్ ఉద్యోగులను జిపిఎఫ్‌లోకి లోకి మార్చి పెన్షన్ సౌకర్యము కల్పించాలని డిమాండ్ చేశారు. స్ట్రగుల్ కమిటీ కన్వీనర్ శివయ్య మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం మీద యజమాన్యానికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వెంటనే సవరణ ప్రకటించాలని కార్మికులకు తెలంగాణ తరహా విధానాలు అమలు చేయాలని అన్నారు. ఉద్యోగులకు పరిమితి లేని మెడికల్ పాలసీని అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఉద్యోగ సంఘ నాయకులు కొండా రెడ్డి, వెంకటస్వామి, హరిఓబుల రెడ్డి, గిరిబాబు, శేఖర్, గంగాధర్, వెంకట్ కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు గంగయ్య, పుల్లారెడ్డి, రాము, సాంబ శివారెడ్డి, నాగేంద్ర, చంద్ర శేఖర్‌లు ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ధర్నాకు తెలుగునాడు యూనియన్ కూడా మద్దతు తెలిపి.. ధర్నాలో పాల్గొన్నారు.










