ప్రజాశక్తి-శ్రీకాకుళం : నేరాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎస్‌పి జిఆర్ రాధిక సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో టెక్కలి పోలీసు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో జూలై నెల నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. రాత్రి వేళలో గస్తీ మరింత పటిష్టం చేసి నేర నియంతునకు ప్రతిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు ముఖ్య కూడళ్ల, ఆలయాలు, ఏటీఎంలు, ఒంటరిగా ఉన్న గృహాలు వద్ద గస్తీ బలోపేతం చేసి, అపరిచిత వ్యక్తులు, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఫోక్సో వంటి కేసులలో నిర్ణిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి సఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. - తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఏక్సిడెంట్ జోన్స్‌గా గుర్తించి, ప్రమాదాలు జరగకుండా కాషనరీ బోర్డులను, స్టాపర్లును, డ్రమ్ములను, బ్లింకర్లును ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై వాహనాల పార్కింగులు లేకుండా చూసేందుకు, రాత్రి సమయాల్లో డ్రైవర్లకు ఫేస్ వాష్ చేయాలని, రహదారి భద్రతా నియమాలపట్ల అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తుల అదృశ్యం కేసులను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టాలన్నారు. దర్యాప్తులోఉన్న గ్రేవ్ కేసుల్లో పెండింగులో ఉన్న అరెస్టులను వెంటనే చేపట్టి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, తీసుకున్న ఫిర్యాదులకు రశీదులను ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ చేసేటప్పుడు ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి గంజాయి, గుట్కా, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం, సిఐలు, డిఎస్పీలు దర్యాప్తు చేస్తున్న తీవ్రమైన కేసులలో సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు వేగవంతం చేసి జిల్లా కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసే విధంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ కేసులో చేపట్టిన దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు సిసిటిఎన్‌ఎస్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్.పిలు (క్రైమ్) టి.పి. విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామి, డిఎస్‌పి డి.బాలచంద్ర రెడ్డి, టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని ఉన్న సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










