Sep 19,2022 09:46
  • దేశవ్యాప్తంగా వేతన పెరుగుదల నామమాత్రం
  • తగ్గిన నిజ వేతనాలు, ప్రజల కొనుగోలు శక్తి
  • 2017 నుంచి ఇదే స్థితి

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజానీకపు ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. కొన్ని సంవత్సరాలుగా వేతనాల పెరుగుదల నామ మాత్రానికి పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వైద్యం వంటి అత్యవసర ఖర్చులు సామాన్యులు భరించే స్థితి దాటిపోయాయి. పెరుగుతున్న ధరలను కూడా పరిగణలోకి తీసుకుంటే వేతనాల పెరుగుదల సున్నా, అంతకన్నా తక్కువకు చేరింది. దీంతో కనీస అవసరాలు తీర్చుకోవడానికి అతలాకుతలమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచాన్ని భయోత్పాతానికి గురిచేసిన కోవిడ్‌ విజృంభణతో సంబంధం లేకుండానే మనదేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కోవిడ్‌ కాలంలో మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ మేరకు ఒక ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ చేసిన అధ్యయనాన్ని న్యూస్‌క్లిక్‌ తాజాగా ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 2017 నుంచే ఈ సంక్షోభ పరిస్థితులు ప్రారంభమైనాయి. 2012 నుంచి 2016 వరకు దేశవ్యాప్తంగా ఆదాయ పెరుగుదల 8.2 శాతం ఉండగా, 2017-21ల మధ్య 5.7శాతానికి పరిమితమైంది. ఒక్క శాతపు కనీస ద్రవ్యోల్భణాన్ని పరిగణలోకి తీసుకున్నా ఈ పెరుగుదల ఇంకా తగ్గిపోతుంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2017-21ల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 2.8శాతం మాత్రమే వేతన పెరుగుదల నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో 5.5శాతంగా ఈ పెరుగుదల ఉంది. ఈ కాలంలో పెరిగిన ద్రవ్యోల్భణాన్ని పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో -3.7శాతం, పట్టణ ప్రాంతాల్లో -1.6 శాతం వేతనాల పెరుగుదల నమోదైంది. దీనర్ధం ప్రజల నిజవేతనాలు గణనీయంగా తగ్గడమే !
 

                                                            కార్పొరేట్లు ఏం చేస్తున్నారు...?

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో రాయితీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలోనూ లక్షల కోట్ల రూపాయలను ఇలా కార్పొరేట్‌ రంగం పొందింది. ఇలా లబ్ధిపొందిన కార్పొరేట్‌ శక్తులు తిరిగి పెట్టుబడులు పెడతారని, దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. అయితే, జరిగింది వేరు. ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో లభ్ధి పొందినప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి వారు ముందుకు రాలేదు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో తమ ఉత్పత్తులకు ఇప్పటికే డిమాండ్‌ పడిపోతోందని, ఈ పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు పెట్టలేమని వారు తెగేసి చెబుతున్నారు. అదే సమయంలో ఉద్యోగాల సంఖ్యను కుదిస్తున్నారు. దీంతో ప్రజానీకం మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు.
 

                                                       'ఆ' నివేదికల ప్రచురణ నిలిపివేత

గతంలో ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ఖర్చు (కన్య్జూమర్‌ ఎక్స్‌పెండించర్‌ సర్వే) నివేదికలను ప్రచురించేది. ఈ నివేదికల ద్వారా రంగాల వారీగా ప్రజల ఆదాయంతోపాటు, వారు చేస్తున్న ఖర్చుల వివరాలను తెలుసుకునే అవకాశం ఉండేది, అయితే, కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికలను ప్రచురించడం నిలిపివేసింది. దీంతో ప్రజల ఆదాయానికి సంబంధించి అంచనాలకు రావడానికి పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్సు సర్వే (పిఎల్‌ఎఫ్‌)లు మాత్రమే ఆధారంగా మారాయి. తాజాగా 2020-21లో ప్రచురించిన పిఎల్‌ఎఫ్‌ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికులు (55శాతం) స్వయం ఉపాధి పై ఆధారపడి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయరంగంలో ఉన్నారు. క్యాజువల్‌ లేబర్‌ 24శాతం, జీతాలపై ఆధారపడిన వారు 13 శాతం ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీతాలపై ఆధారపడిన వారు 43 శాతం, క్యాజువల్‌ లేబర్‌ 13 శాతం, స్వయం ఉపాధి రంగంలో 33శాతం ఉన్నారు. అన్ని రంగాల్లోనూ పురుషుల కన్నా స్త్రీలు పొందుతున్న మొత్తం తక్కువగా ఉంది.

01