May 15,2023 09:01

        సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చి మనకు తెలియకుండానే మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈనాటి జీవితాలని దాన్ని నడిపిస్తున్న చలన సూత్రాలను అర్థం చేసుకోవడం కష్టం. అర్థం చేసుకుని వీటిని కథలుగా మలచుకోవడం మరీ కష్టం. అందుకని సమాజం గురించే కాకుండా, ఆ సమాజం వెనుక ఉన్న శక్తుల్ని గురించి కూడా తెలుసుకోవడం అవసరం. సామాజిక బాధ్యతను గుర్తించిన రచయితలు మాత్రమే అలాంటి కథలను రాయగలరు. ఇలాంటి రచయితల్తో వివిన మూర్తి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.
           ఇతర రాజ్యాల మీదికి దండయాత్ర చేసి వారిని నిర్మూలించి, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంతో సరికొత్త నాగరికత వెలిసిందని చరిత్రకారులు నమోదు చేస్తారు. కానీ దాని వెనుక ఉన్న అన్యాయం, అమానుషం, ఘోరమైన హత్యాకాండ కనిపించకుండా పోతుంది. చరిత్ర ఎప్పుడూ విజేతల పక్షానే నిలుస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపెట్టిన ఆయుధాలు విజయాన్ని, ఆధిక్యతను తెచ్చి పెడతాయి. నీ ఆయుధమే నాగరికత. నీకు గిట్టని వాళ్ళని అనాగరికులని, దుర్మార్గులని, ప్రజా కంటకులనే పేరుతో తరిమేయవచ్చు. నాశనం చేయొచ్చు. అనాది నుంచి ఇదే కొనసాగుతోంది. ఆర్యుల దండయాత్ర మొదలు మహాభారతంలోని ఖాండవ దహనం వరకు ఎన్నో ఉదాహరణలను చూడొచ్చు. ఆధునిక కాలంలో ప్రపంచంలోనే అజేయ శక్తిగా రూపొందిన అమెరికా రాజ్య స్వభావంలో, వియత్నాం మొదలుకొని ఇరాక్‌పై చేసిన దండయాత్రలలో ఇదే యుద్ధ నీతి కనబడుతుంది. ఒకప్పుడు మతం కోసం జరిగిన యుద్ధాలు ఇప్పుడు వనరుల దోపిడి కోసం జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసినా తెలియనట్టే నటించడం ఓ విషాదం. ఈ వ్యంగ్య కథనాన్ని 'కృష్ణ స్వప్నం' కథలో చూడవచ్చు.
       రాజులు పోయినా, నియంతలు మారినా, ప్రజాస్వామ్యం వచ్చినా దోపిడీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. బలవంతుడు బలహీనుడిని దోచుకుంటూనే ఉన్నాడు. పాలకులు, పీడితులు అనే స్పష్టమైన విభజనను ఇప్పుడు మనం చూడవచ్చు. మేకలు ప్రజలు. అధికారం, నాయకత్వం ముసుగు వేసుకున్న దోపిడీదారులు పులులు. పులులను, మేకలను ఒకే రేవులో నీరు తాగించడం అసంభవం. కాలం మారుతున్న కొద్దీ, అభివృద్ధి జరుగుతున్న కొద్ది దోపిడీ స్వభావం మారుతుంది. రకరకాల రూపాల్లో దోపిడీదారులు బయలుదేరుతారు. మేకల తరఫున నాయకత్వం వహించిన వాళ్లు పులులతో రాజీ పడతారు. లేదా లోపాయికారీగా కలిసిపోతారు. స్వాతంత్రం రావడం అంటే అధికార మార్పిడి జరగడమే. పీడనకు తెల్లదొరలు పోయి నల్ల దొరలు వచ్చారు. స్వపరిపాలన, అభివృద్ధి, దేశభక్తి పేరిట ప్రజలను ఏమార్చి వాళ్లను దోచుకోవడం మరింత సులభతరమైంది. మేల్కొన్న ప్రజలు వాళ్ళ నాయకులను వాళ్లే తయారు చేసుకుంటాం అనడంతో కొత్త శకం ప్రారంభం అవుతుందనే ఆశావాదంతో 'సమవర్తి' కథ ముగుస్తుంది.
       వలసలు, ఆక్రమణలు, యుద్ధాలు చేసి సామ్రాజ్యవాదం విస్తరించింది. ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్లి యుద్ధాలు చేసి, ఆ దేశాలను పరిపాలించాల్సిన అవసరం లేదని డబ్బు బలంతో, ఇతర దేశాలను రిమోట్‌ కంట్రోల్‌ పద్ధతిలో చాలా సులువుగా పరిపాలించవచ్చని నూతన సామ్రాజ్య వాద దేశాలు తెలుసుకున్నాయి. వాళ్ల పెట్టుబడిదారీ తత్వాన్ని ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. సామ్రాజ్యవాదం యొక్క తత్వం మారిపోయి ప్రపంచీ కరణ పేరుతో ముందుకు వచ్చింది. దీనివల్ల దాదాపు 150 సంవత్సరాలు పోరాడి కార్మికవర్గం సాధించుకున్న అన్ని హక్కులూ పోయాయి. దాదాపు అన్ని ఉత్పత్తి రంగాలూ ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లోకి మళ్లాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుకు, కార్మికులకు మధ్య ఉన్న సంబంధాల గురించి 'పాడుకాలం' నవలిక చర్చిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న శత్రు వైరుధ్యాలను వివరిస్తుంది.
         మీనాంబికా ఇండిస్టీస్‌కు కొత్తగా మేనేజర్‌గా వచ్చిన గంగూలీకి, పాత మేనేజర్‌ అంబలగన్‌ను కార్మికులు చితకబాదితే, వాడు పారిపోగా ఆ పోస్ట్‌ తనకిచ్చారని తెలుసు. ముందుగా కార్మికుల ఐక్యతను దెబ్బతీయాలనుకుంటాడు. ఫోర్‌మెన్లను, ఇన్చార్జీలను పిలిచి కార్మికులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాడు. పదిమంది సూపర్వైజర్‌లను బాగా చూసుకుంటే వాళ్ళు 1200 మందిని పిండి పనిచేస్తారని అతని నమ్మకం. కార్మికులను మచ్చిక చేసుకోవడానికి ఓటి పద్ధతిని ప్రవేశపెడతాడు. ఓటి మీద యజమాని గంగోలిని ప్రశ్నిస్తే 'కార్మికుడు ఓటీ ఆశతో మామూలు సమయంలో రికార్డు పని చేయించగలిగితే మనకి లాభం కాదా! ప్రపంచంలో ఏం జరుగుతున్నది తెలుసుకునే సమయంలో కూడా రోజుకి 12 గంటలకు పైగా ఫ్యాక్టరీలో ఉంచితే మనకి లాభం కదా. వాళ్లని జీతభత్యాల కోసం మాత్రమే పోరాడేవాళ్లుగా మార్చడంలో ఆధునిక పెట్టుబడిదారుడు ఎంత విజయం సాధించాడో, వాళ్లని ఎన్ని గంటలు కట్టిపడేసి మరమనుషులుగా మార్చడంలోనూ అంత విజయం ఉందని' నచ్చ చెబుతాడు. కార్మికులు డబ్బుల కోసం పడే పాట్లు, తాగుడు లాంటి అలవాట్లతో ఇంటిని సరిగా నడప లేకపోవడం- అప్పులు, చీటీలు, తాగుడు గొడవలు, ఓటీలు, ప్రమోషన్లకై చేసే ప్రయత్నాలను ఇలా కార్మికులకు సంబంధించిన అన్ని విషయాలను ప్రస్తావిస్తూ వివిన మూర్తి ఈ నవలిక రాశారు.
        సరళీకృత ఆర్థిక విధానాలు కార్మికుల జీవితాల్ని అతలాకుతలం చేశాయి. ప్రైవేటైజేషన్‌ శరవేగంగా అమలవడంలో పెట్టుబడిదారుల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. మారుతీ కంపెనీ ఉద్యోగస్తులు ప్రైవేటైజేషన్‌ ప్లాన్స్‌ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తుంటారు. దానిపై రామోస్‌ మోటార్స్‌ జనరల్‌ మేనేజర్‌ గంగూలీ మాట్లాడుతూ... ఎంప్లాయిస్‌కి ఉద్యోగ భద్రత మీద ఆందోళన సహజం. అయితే ప్రైవేటు పరిశ్రమల కింద మాత్రమే బతకతప్పదని వారు గ్రహిస్తారు. అలవాటు పడతారు. పెట్టుబడిదారుడికి కూడా సమ్మెలతో, ట్రేడ్‌ యూనియన్‌తో సహజీవనం తప్పదన్న జ్ఞానం ఉంటుంది. వాటితో వ్యవహరించే అనుభవమూ ఉంటుంది.' 'ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కండిషన్స్‌ ఒకటి కావు. కలిగిన దేశాల్లో కార్మికులు, పేద దేశాల కార్మికులతో కలిసే అవకాశం లేదు. పెద్ద కంపెనీల వాళ్ళు చిన్న కంపెనీల వాళ్ళతో కలవలేరు. మేథోశ్రమ చేసే వాళ్ళకి ఇచ్చే జీతాలు, వాళ్లు కార్మికులేనన్న అభిప్రాయమే కలుగనీయవు. సంఘటిత రంగంలోని కార్మికులు ఎప్పటికీ అసంఘటిత రంగంలోని కార్మికుల గురించి పట్టించుకోరు. ఆ కార్మికులను సంఘటిత పరిచి బతికేవాళ్ళు, వీళ్లను సంఘటిత పరచడంలో చనిపోయే వాళ్ళ మీద చూపే కనీస సానుభూతి కూడా చూపించరు. అంతో ఇంతో ఉద్యోగం ఉన్నవాళ్లు, అసలు లేని వాళ్ళ గురించి ఆలోచించే అవకాశమే లేదు. వివిధ పార్టీలు కార్మికుల్లో తమ పట్టును చూపెట్టడానికైనా సొంత కార్మిక యూనియన్లు పెట్టుకోక తప్పదు. అందుకోసం అవసరమైతే వాడుకోవడానికి అనేక భాషలు, మతాలు ఉన్నాయి'' అని కార్మికుల్లో ఉన్న అనైక్యత గురించి చెబుతాడు. ప్రపంచీకరణ ప్రభావం వల్ల కార్మికుల జీవితాలు ఎన్ని ఒడిదుడుకులకు గురవుతాయో ముందే హెచ్చరిస్తూ 95లో రాసిన ఈ కథ ప్రాసంగికత ఇప్పుడు మరింత గట్టిగా వ్యక్తమవుతోంది.
        ఫ్యాక్టరీలను జాతీయం చేద్దామంటాడు కమ్యూనిస్టు. మార్కెట్లను అంతర్జాతీయం చేసేద్దామనుకుంటాడు క్యాపిటలిస్ట్‌. మార్కెట్లను అంతర్జాతీయం చేయడం అంటే మార్కెట్లపై నియంత్రణ ఎత్తివేత. విదేశీ వస్తూత్పత్తుల ప్రవేశానికి మార్గం సుగమం చేయడం. విదేశీ ఉత్పత్తులతో పోటీ పడలేని సంస్థలు తమ దుకాణాలను మూసివేయక తప్పదు, లేదా వాటిలో లీనమైపోవాలి. కుట్రలు, కుతంత్రాలు చేసి అయినా ప్రత్యర్థుల ఉత్పత్తి కంపెనీలను దెబ్బ తీసి, తమకు పోటీ లేకుండా చూసుకొని, తమ ఉత్పత్తుల గిరాకీని పెంచుకున్న ఉదంతాన్ని 'మాయ- మహామాయ' కథలో చూడవచ్చు.
           ప్రజలకు ఉచితంగా అందజేయాల్సిన విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకొని, వాటిని ప్రైవేటు పరం చేసేసింది. సేవా భావాన్ని మరిచిపోయిన ఆధునిక వైద్యం పూర్తిగా వ్యాపారమయమై పోయింది. ప్రభుత్వ నియంత్రణ, పాపభీతి లేకుండా ఆధునిక ఆసుపత్రులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ప్రచారం, ఆడంబరం, అట్టహాసాలతో గొలుసుకట్టుగా కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆధునిక వైద్య సదుపాయాల పేరిట పేషంట్లను నిలువు దోపిడీ చేస్తూ, మానవత్వాన్ని మంటగల్పుతున్న రీతి 'దిశ' కథలో కనిపిస్తుంది.
          'స్ప ృహ' కథలో- తన మనసులోని వేదన, అశాంతి నుంచి బయటపడటానికి శేఖరం కవిత్వాన్ని వాహికగా చేసుకుంటాడు. విప్లవోద్యమంలో చేరి అడవుల వెంట తుపాకీ పట్టుకొని తిరిగాడు. ఇదంతా గతం. ప్రస్తుతం ప్రసిద్ధ తెలుగు వార, మాసపత్రిక 'ప్రకాశం' సంపాదకుడు, బిజినెస్‌ మేనేజర్‌గా వెలిగిపోతుంటాడు. ఒకసారి హైదరాబాద్‌లో జరిగిన స్త్రీవాదుల సమావేశంలో కరుణ చేసిన ఉపన్యాసం, వాదనా పటిమ అతడిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆమెతో కలిగిన పరిచయంలో తన జీవితంలోని వేదనను, అశాంతిని వెళ్లగక్కి, సేదతీరి తనను తాను ప్రక్షాళనం చేసుకుంటాడు. ఈ పెద్ద కథ ప్రధానంగా ఫెమినిజంపై చర్చ పెట్టినా- పత్రికలు, సంపాదకులు, కవులు, రచయితలు, స్త్రీవాదులపై వేసిన విసుర్లు, చర్చలతోనే కొనసాగుతుంది.
      సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ దుష్పరిణామాలను - అవి మన జీవితాల్లో తెస్తున్న సంక్షోభాన్ని, కల్లోలాన్ని వివిన మూర్తి కథలు అద్భుతంగా ఆవిష్కరించాయి. ఇవి పైకి మామూలు కథల్లా కనిపించినా, అంతర్లీనంగా రచయిత తాను చెప్పదలుచుకున్న వాటికి చర్చావేదికగా ఉపయోగించుకోవడం బాగా వచ్చింది. కొన్ని కథలు అంతరార్థక కథలుగా, కొన్ని మల్టీ లేయర్‌ కథలుగా కనిపిస్తాయి. 'కృష్ణ స్వప్నం' కథలో కనిపించిన ప్రతీకాత్మకత, మ్యాజిక్‌ రియలిజం ఆ కథను మంచి వ్యంగ్య కథగా తీర్చిదిద్దాయి. సమాజంలోని అన్ని విషయాలను, వ్యక్తుల మధ్య అంతరాలను, వారిలో పొడసూపే రకరకాల ధోరణులను చర్చకు పెట్టిన ఈ కథలు ఆసక్తికరంగా ఉండి మనల్ని ఆలోచింపజేస్తాయి.
 

- కె.పి.అశోక్‌ కుమార్‌