Jun 05,2023 19:53
  •  లేనిపక్షంలో లంక భూముల్లోనే నిద్రిస్తా : ఎమ్మెల్యే నిమ్మల

ప్రజాశక్తి - యలమంచిలి (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామ దళితులు సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన లంక భూముల పేదల పోరాటానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సోమవారం మద్దతు తెలిపారు. తొలుత జాతీయ రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరుగులంక భూముల్లోకి పేదలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ పెరుగులంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అక్రమ మట్టి తవ్వకాలు ఆపకుంటే పేదలతో కలిసి లంక భూముల్లోనే నిద్రిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 70 ఏళ్లుగా సుమారు 400 కుటుంబాల చెందిన దళితులు, పేదలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పేదలకు లంక భూములు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పెద్దఎత్తున పోలీసు బలగాలను కాపలాగా పెట్టి లారీలతో మట్టిని అక్రమంగా తరలిస్తూ పేదల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మట్టి తరలింపు ఆపకుంటే లంక భూముల్లోనే వంటావార్పు నిర్వహించి అక్కడే నిద్రిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్‌పి, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. పేదల న్యాయమైన సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లా అండ్‌ ఆర్డర్‌ సమస్య లేకుండా చూడాలని, లంకల్లోకి మట్టి తవ్వకానికి వచ్చిన జెసిబిలను, లారీలను వెంటనే వెనక్కి పంపించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లంక భూముల్లో మట్టి తరలింపు ఆపకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.