Sep 23,2023 21:40
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం

ప్రజాశక్తి-యంత్రాంగం : విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తుంటే వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మోడీని ఎందుకు ప్రశ్నించడంలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన ఉక్కు రక్షణ బైక్‌ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో మూడో రోజు ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మందస, పాతట్నం, కొత్తూరు ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో లోకనాథం మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రజల ఆస్తి అని అన్నారు. లక్షల కోట్ల ప్రజల సంపదను కారు చౌకగా అదానీ, అంబానీలకు కట్టబెడుతుంటే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరెత్తకపోవడం సరికాదన్నారు. ఉక్కు ప్రయివేటీకరణపై మోడీని నిలదీయాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని, అలాంటి కర్మాగారాన్ని ప్రయివేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం సిపిఎం సాగిస్తోన్న పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. సోంపేటలో పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు వై కృష్ణమూర్తి బైక్‌ యాత్రకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉక్కు కర్మాగారాన్ని మరింత అభివద్ధి చేయాల్సిందిపోయి ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని చూడడం దారుణమన్నారు. కంచిలి మండలానికి చెందిన వైసిపి నాయకులు ఇప్పిలి కృష్ణారావు సభకు హాజరై సంఘీభావం తెలిపారు. మందసలో వీరగున్నమ్మ స్థూపానికి నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొత్తూరులో డప్పు కళాకారులు డప్పు వాయిద్యాలతో యాత్రకు ఆహ్వానం పలికి పూల జల్లు కురిపించారు. యాత్ర సాగిన ప్రాంతాల్లో ప్రజా, కార్మిక, రైతు సంఘాలు సంఘీభావం తెలిపాయి. కొత్తూరు నుంచి బైక్‌ యాత్ర పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మీదుగా పాలకొండకు చేరుకుంది. సీతంపేటలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి లోకనాథంతోపాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కార్యదర్శులు గోవిందరావు, రెడ్డి వేణు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలకొండలో జరిగిన సభలో లోకనాథం మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు ఐక్యంగా ఉద్యమించి కాపాడుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అగ్రగామిగా స్టీల్‌ను ఉత్పత్తి చేసే సంస్థగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఉందని తెలిపారు. అలాంటి ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్రపన్నుతోందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి జగన్‌, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.