- రాజకీయ పార్టీలకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు స్పష్టీకరణ
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని, మోడీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు హెచ్చరించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 947వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ సింటర్ ప్లాంట్ విభాగం కార్మికులు కూర్చున్నారు. వారిని ఉద్దేశించి పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, కో-కన్వీనర్ జె.అయోధ్యరాం, నాయకులు రామకృష్ణ మాట్లాడారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత వారం ఢిల్లీలో ప్రధాన రాజకీయ పార్టీల ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లను కలిసి ఉక్కు పరిరక్షణ విషయమై విన్నవించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీకి బి టీమ్‌గా మారడం శోచనీయమన్నారు. వామపక్షపార్టీలు మాత్రమే చిత్తశుద్ధితో ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని స్పష్టం చేశారు. అధికార, విపక్ష పార్టీలు బిజెపికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఉక్కు పోరాటంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కెవి.సత్యనారాయణ. ఉమామహేశ్వరరావు. డిఎస్‌ఆర్‌సి.మూర్తి, జె.వెంకటేశ్వరరావు, కె.బాబూరావు పాల్గొన్నారు.










