- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 870వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ ఎస్‌ఎంఎస్ - 1 విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం రెండేళ్ల నుంచీ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న భారీ పరిశ్రమ స్టీల్‌ప్లాంట్ అని, దాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన వారికి నేటికీ ఉద్యోగాలు రాలేదని, వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యమం దేశ నలుమూలలకూ పాకిందని, దీన్ని గుర్తించైనా కేంద్రం వెనక్కు తగ్గాలని అన్నారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.రామకృష్ణ, కె.రాజబాబు, జివి.సుబ్బయ్య, రమణమూర్తి, బి.అప్పారావు, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.










