- ప్లాంట్‌లో ప్రయివేట్ సంస్థ తిష్టకు ఢిల్లీ పెద్దల స్కెచ్?
- ఆక్సిజన్ ప్లాంట్‌కు మోకాలడ్డుతున్న బిజెపి
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పీకనులిమేందుకు ఢిల్లీలోని బిజెపి పెద్దలు కుట్రల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఉక్కులోని ఆక్సిజన్ ప్లాంట్‌పై తాజాగా వీరి కన్ను పడింది. ఉక్కు ఉత్పత్తికి ఐరన్ ఓర్, బొగ్గు, విద్యుత్ ఎంత అవసరమో ఆక్సిజన్ కూడా అంతే అవసరం. అటువంటి ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రయివేటీకరించడం ద్వారా కేంద్రంలోని పాలకులు విశాఖ ఉక్కు ఊపిరిని తీసెయ్యాలని స్కెచ్ వేశారు. నెలల తరబడి కోల్, ఐరన్ ఓర్ రాకుండా కేంద్రం ఇప్పటికే అడ్డుపడుతోంది. ఆక్సిజన్ ప్లాంట్ కోసం ఓ ప్రయివేట్ సంస్థ ప్లాంట్‌లో తిష్ట వేసే ఏర్పాట్లు చేస్తుండడంతో విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికవర్గం మరోసారి భగ్గుమంటోంది. 'ఆక్సిజన్ ప్లాంట్ లేకుండా చేస్తే ఉక్కు ఊపిరి పోయినట్టే. ఈ కుట్రలను తిప్పికొడతాం' అని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ జె.అయోధ్యరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌లో చాలా కాలం నుంచి ఆక్సిజన్ సెపరేషన్ యూనిట్లు మూడు ఉన్నాయి. రోజుకు ఒక్కో యూనిట్ నుంచి 500 టన్నుల చొప్పున మూడింటి నుంచి 1500 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్ విస్తరణలో భాగంగా మరో రెండు యూనిట్ల నిర్మాణం చేశారు. అవి ఒక్కొక్కటీ 600 టన్నుల చొప్పున 1,200 టన్నులు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తం కలిపి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 2700 టన్నులు రోజుకు ఉత్పత్తి జరుగుతోంది. దీన్ని ఎస్‌ఎంఎస్, బ్లాస్ట్ ఫర్నేస్‌ల డిపార్టుమెంట్లలో వాడుతున్నారు. ప్లాంట్ విస్తరణలో మరింత ఆక్సిజన్ అవసరమైనందున 2010లో ఫ్రెంచ్‌కు చెందిన ఎయిర్ లిక్విడ్ కంపెనీతో 1,700 టన్నుల ఆక్సిజన్ తయారీకి ఒప్పందం జరిగింది. ఆ ప్లాంట్ నిర్మాణం పూర్తయి 2014లో ట్రయల్ రన్‌కు రాగా, ఒక పెద్ద కంపెనీలో మరో పెద్ద కంపెనీ వచ్చి ప్లాంట్ కడితే ఆ ప్లాంట్‌కు ఎలా లైసెన్సు ఇస్తారంటూ అప్పటి టిడిపి ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ ఆగిపోయింది. ఆక్సిజన్ సరిపడా లేకుండా స్టీల్‌ప్లాంట్ ముందుకుపోయే అవకాశం లేనందున ఆ మొత్తం యూనిట్‌ను స్టీల్‌ప్లాంట్‌కు ఇవ్వాలని ఫ్రెంచ్ కంపెనీని కోరగా, రూ.1000 కోట్లు ఇస్తే కంపెనీ మొత్తాన్ని హేండోవర్ చేస్తామంటూ స్టీల్‌ప్లాంట్‌కు ఆ కంపెనీ చెప్పింది. 2014-15లో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రూ.250 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ, ఎయిర్ లిక్విడ్ కంపెనీ, స్టీల్‌ప్లాంట్ మధ్య సరైన అవగాహన లేనందున ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌కు ఈ విషయం వెళ్లింది. పదేళ్లపాటు దీనిపై ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. తాజాగా దీనిపై ఫ్రెంచ్ కంపెనీ తరుఫున ప్రముఖ న్యాయవాది శ్రీహరీష్ సాల్వే, వైజాగ్ స్టీల్ తరుఫున ఓ మాజీ జడ్జి వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ఎయిర్ లిక్విడ్ కంపెనీకి రూ.389 కోట్లు చెల్లించి ఆ కంపెనీని ఆపరేట్ చేసుకోవచ్చని ఆర్బిట్రేషన్‌లో చెప్పగా, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఇప్పటికే రూ.80 కోట్లు చెల్లించింది.
తాజాగా ఏం నడుస్తోంది?
పదేళ్లపాటు మూలనపెట్టిన ఎక్విప్‌మెంట్ తుప్పుపట్టిన కారణంగా తాజాగా లైసెన్స్ తీసుకుని వివిధ పద్ధతుల్లో వీటన్నిటినీ సరిచేసేందుకు స్టీల్‌ప్లాంట్ సిద్ధమైంది. తొమ్మిది నెలల క్రితమే పైనతెలిపిన రూ.80 కోట్లను రెండు దఫాలుగా ప్లాంట్ చెల్లించింది. మిగిలిన రూ.300 కోట్లను బ్యాంకు ద్వారా తీసుకొచ్చి ఎయిర్ లిక్విడ్ కంపెనీకి స్టీల్‌ప్లాంట్ ఇచ్చేస్తే యుటిలిటీస్ డిపార్టుమెంట్‌గా పిలవబడేటువంటి నెంబరు 2 డిపార్టుమెంట్ అంతా స్టీల్‌ప్లాంట్ పరమవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు దీన్ని మీరు నడపలేరని, వేరే వాళ్లకి ఇచ్చేసి అక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకోవాలని మెలిక పెట్టారు. దీంతో, ప్లాంట్ ఉన్నతాధికారులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కేంద్రం కుట్రలను తిప్పికొడతాం : జె.అయోధ్యరామ్, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో - కన్వీనర్
భారీ ప్రయివేట్ కంపెనీలు ప్లాంట్‌లో తిష్టవేసేలా ఢిల్లీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు యాజమాన్యంతో స్టీల్‌ప్లాంట్ పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. రూ.300 కోట్లను తొమ్మిది శాతం వడ్డీకి ప్లాంట్‌కు ఇచ్చేందుకు రెండు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అడ్డుపుల్ల వేయడం సరికాదు. కేంద్రం కుట్రలు చేసి ప్లాంట్‌ను నడపకుండా ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు.










