Jul 01,2023 20:32
  • క్రషింగ్‌తో కాలుష్యం పెరుగుతుందంటూ మావోయిస్టుల లేఖ

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం (విజయనగరం జిల్లా) : ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్‌ క్రషింగ్‌ నిర్వహించడాన్ని నిరసిస్తూ క్రషర్స్‌ యాజమాన్యం వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు జిల్లా రాయగడ సమీపంలోని మునిగూడ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రాంత వాసి స్టోన్‌ క్రషింగ్‌ నిర్వహిస్తున్నందుకు నిరసనగా మావోయిస్టులు రెండు క్రషర్‌ జెసిబిలు, ఐదు లారీలు, రెండు రోడ్డు రోలర్లను కాల్చి ధ్వంసం చేశారు. క్రషింగ్‌ వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. క్రషర్‌ బ్లాస్టింగ్‌ వల్ల పంటలు దెబ్బతింటాయని, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. క్రషర్‌ యజమానులు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ఆంధ్రా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో ఒడిశా నుంచి ఆంధ్రాకు వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టుల కదిలికలపై దృష్టి సారించి కూంబింగ్‌ చేపడుతున్నారు. పోలీస్‌ స్టేషన్లో భద్రత పెంచారు.