చెన్నై: తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. విరుదునగర్ జిల్లాలోని కమ్మపట్టి గ్రామంలోగల ఓ పటాసుల కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ నుంచి హాహాకారాలు వినిపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ఫ్యాక్టరీలో మరో పేలుడు సంభవించింది. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనా ప్రాంతం నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. కాలిన గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారిలో నలుగురు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 9 కి పెరిగింది. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.