చెమట అతడి శక్తిపీఠం
సుప్రభాత సంధ్యలు ఇలవేల్పులు
కండల కైంకర్యం నిత్య నైవేద్యం
ఆకలి అతగాడి ఆత్మబంధువు
నిరంతరం అలల్ని ఎగదోసే సింధువు
దివారాత్రం వెన్నంటి ఉండే అంతశ్శత్రువు
లిలిలి
శాసనం ప్రభువుల వారి ప్రసాదం
అర్చన అక్కర్లేని అధికార పత్రం
మొక్కులు నిర్ణయించే శఠగోపం
ఆజ్ఞల జారీ ధర్మకర్తల దయాదక్షిణ
ఖజానా రక్షణ పేరిట అష్టోత్తరం
పానకం వడపప్పు పంపిణీకి శుద్ధాచమనం
నూకలు జల్లటంలో
అధినేతల ప్రావీణ్యం పరమ ప్రామాణికం
సుంకం తగిలించటంలో
చేతివాటం మహా సుకుమారం
నొప్పి తెలియకుండా వడ్డించటం
విభాగాధిపతుల విశ్వకళా వైభవం
లిలిలి
జఠర వాహిని వరదలెత్తుతున్నా
అతడి చేతులు నోటిదాకా చేరలేవు
మెలిదిరిగిన పేగులు కేకలేస్తున్నా
కాళ్లు కాస్తయినా ముందుకు కదల్లేవు
కడుపులు తవ్వి ఎలకలు పట్టడం ఎలాగో
సూత్రధారికి బాగా తెలుసు
ఎటొచ్చీ ఎలకలు కన్నెర్రజేస్తే పుట్టేది
విఘ్నాలు కాదు... విస్ఫులింగాలు!
ఆ జ్వాలల్లో కుర్చీలు కాలిపోతాయని
ఏలినవారికి ఇప్పుడప్పుడే తెలీదు!
- ఎమ్వీ రామిరెడ్డి
98667 77870










