- శాశ్వత ప్రాతిపదికన కంచె ఏర్పాటు!
ప్రజాశక్తి - తిరుపతి సిటీ : శ్రీవారి యాత్రికులపై చిరుతపులులు దాడులు చేయకుండా తిరుమల నడకమార్గంలో శాశ్వత ప్రాతిపదికన కంచె ఏర్పాటు చేసే దిశగా టిటిడి, అటవీ శాఖ ఆలోచన చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల చిరుత దాడిలో మృతిచెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియో అందించామన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, ఇప్పటివరకూ శేషాచలం అడవిలో దొరికిన రెండు చిరుతలను తిరుపతి ఎస్‌వి జూపార్కులో ఉంచామని తెలిపారు. ప్రభుత్వం తరుపున పూర్తిస్థాయిలో టిటిడికి సహకరిస్తామన్నారు. టిటిడి నివేదిక వచ్చిన తరువాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.