- రష్యా నుంచి పెరిగిన దిగుమతులు
న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో భారత స్టీల్ ఎగుమతులు వెలవెల పోతున్నాయి. మరోవైపు దిగుమతులు అనుహ్యాంగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత ఉక్కు ఎగుమతులు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు ప్రభుత్వ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముడి స్టీల్ ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ 2022-23లో 6.7 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేసింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 50.2 శాతం పతనాన్ని చవి చూసింది. దీంతో 2018-19 నాటి స్థాయికి ఎగుమతులు పడిపోయాయని రాయిటర్స్ ఓ కథనంలో తెలిపింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రధాన స్టీల్ తయారీ కంపెనీల లాభాలు తగ్గాయి. ఎగుమతులపై గతేడాది మేలో ప్రభుత్వం అధిక పన్ను వేయగా.. దీన్ని నవంబర్‌లో ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో దిగ్గజ స్టీల్ కంపెనీ జెఎస్‌డబ్ల్యు స్టీల్ తమ ఎగుమతులు పెరిగినట్లు పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత స్టీల్ దిగుమతులు 29 శాతం పెరిగి 6 మిలియన్ టన్నులుగా చోటు చేసుకున్నాయి.
- 2019-20 తర్వాత ఇదే అత్యధిక దిగుమతి
గడిచిన ఏప్రిల్ నుంచి జనవరి కాలంలో రష్యా నుంచి భారత్‌కు అత్యధిక స్టీల్ దిగుమతులు జరిగాయి. దీంతో ఆ దేశం నుంచి స్టీల్ దిగుమతులు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలం రష్యన్ ఎగుమతులతో పోల్చితే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా పెరిగాయి. దేశంలో 2022-23లో ముడి ఇనుప ఖనిజం రికార్డ్ స్థాయిలో 125.32 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయ్యింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 4.2 శాతం ఎక్కువ. మరోవైపు 12.7 శాతం వృద్థితో 119.17 మిలియన్ టన్నుల స్టీల్ వినియోగం చోటు చేసుకుంది.










