ఎండలు మండుతున్న వేళ మన శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచడానికి కావలసిన ఆహారాలపై శ్రద్ద పెట్టడం చాలా అవసరం. అయితే ఏయే ఆహారపదార్థాలు మేలు చేస్తాయో తెలుసుకుని తినాలి. అలాగే ఏవి తింటే హానికరమో తెలుసుకోవాలి. తినకూడని ఆహారాలను తరచూ తీసుకుంటుంటే విపరీతమైన విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో తినకూడని ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..
వేయించిన ఆహారాలు : వేసవిలో వేయించిన పదార్ధాలు తరచూ తినడం వల్ల నీరసం, కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
మసాలా వంటకాలు : కారం ఎక్కువగా ఉండే వంటకాలను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి అధిక చెమట పడుతుంది. వాటికి బదులుగా తేలికపాటి రుచుల్లో ఆహారం సిద్ధం చేసుకోవాలి.
కార్బోనేటేడ్ డ్రింక్స్ : కార్బోనేటేడ్ డ్రింక్స్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ పానీయాలలో అధిక స్థాయి చక్కెర, ఆర్టిఫిషియల్ రంగులు, రుచులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటికి బదులుగా నీరు, తాజా పండ్ల రసాలు లేదా హెర్బల్ టీ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
డెజర్ట్స్ : క్రీమీ డెజర్ట్‌లు తీసుకోవడానికి బదులు తాజా పండ్ల సలాడ్‌లు, పెరుగు లేదా సోర్బెట్‌లు వంటి తేలికపాటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
రెడ్ మీట్ : వేసవిలో రెడ్ మీట్ వంటకాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్ల దీనికి బదులుగా చేపలు, చికెన్ లేదా ఆకుకూరలను తినడం మంచిది.










