ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) వడ్డీ రేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒత్తిడి పరీక్షలను క్రమం తప్పకుండా చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అమెరికా, ఐరోపాలోని కొన్ని బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో దేశీయంగా ఉన్న పీఎస్‌బీల పని తీరుపై సమీక్షించేందుకు ఆమె శనివారం సమావేశం నిర్వహించారు. వివిధ ఆర్థిక అంశాలు సదరు బ్యాంకుల్లో ఎలా ఉన్నాయి? ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ఆమె పీఎస్‌బీలకు దిశానిర్దేశం చేశారు. 2 గంటల పాటు కొనసాగిన సమావేశంలో ఆయా పీఎస్‌బీల ఎండీలు, సీఈఓలు పాల్గన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ), సిగేచర్ బ్యాంకుల వైఫల్యం, క్రెడిట్ సూయిజ్ సంక్షోభం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










