Jun 12,2023 07:01

           ఆ మధ్య విజయవాడలో కవితా సాంస్క ృతిక సంస్థ వారి అవార్డుల ఫంక్షన్‌లో భండారు విజయ గారిని కలిశాను. అదే మొదటిసారి ఆమెను చూడడం, కలవడం. పరిచయాలు, పలకరింపులు అయ్యాక నా కవితా, కథా సంపుటులు ఆమెకు ఇవ్వగానే, ''మీరు కథలు కూడా రాస్తారా? ఐతే ఒక కాన్సెప్ట చెప్తాను. దానిపై కథ రాయండి'' అన్నారు. ఒంటరి మహిళ అనే అంశంపై రాయమని చెప్పి, ఒక వారం రోజులు గడువు లోపల కథ ఇవ్వాలన్నారు. కానీ, నేను కొన్ని అనివార్య కారణాల వల్ల విజయవాడలోనే ఉండిపోవాల్సి వచ్చింది. విశాఖపట్నం తిరిగొచ్చాక రాయలేకపోయానని మెసేజ్‌ పెట్టాను. పరవాలేదని చెప్పి, మరొక పది రోజులు గడువిచ్చారు. నా ఆలోచనలలో ఎన్నాళ్ళగానో మెదులుతున్న కథ, నేను అనుకున్నదంతా కథగా చెప్పలేనేమో అనుకున్న కథను మొత్తానికి పూర్తి చేశాను. కథ బావుందని కొన్ని చిన్న సూచనలు చేశారు. ఆ ప్రకారం కథకు మార్పులు చేసి వారికి పంపాను. నా కథ 'స్వయంసిద్ధ' కథాసంకలనంలో చేరిందని తెలిసాక గర్వపడ్డాను. మహిళల జీవితాల గురించి, వారి వ్యథల గురించి మహిళలు కాక ఇంకెవరు విపులంగా చెప్పగలరు ?
           స్త్రీ అంటే సమాజానికి ఒక చిన్నచూపు ఎప్పుడూ ఉంటుంది. 'ఆడామగా సమానమైనా, మగవాడు కాస్త ఎక్కువ సమానం' అన్నట్టు ఆ తేడా ఎప్పటికీ చెరిగిపోనిది. బయటకు అనకపోయినా అది రకరకాలుగా వ్యక్తమౌతుంది. ఇక ఒంటరి మహిళంటే సమాజం విపరీతమైన ఆసక్తి కనబరుస్తుంది. ఆమె గురించి అన్నీ ఎలాగైనా తెలుసుకుని, కాలక్షేపంగా మాట్లాడుకుని తెగ ఆనందపడుతుంది. పెళ్ళి అవకపోయినా, పెళ్ళై భర్త చనిపోయినా లేక దూరమైనా, ఒంటరిగా ఉండి మరొక స్నేహితుడితో సన్నిహితంగా మెలిగినా గుసగుసలు పోతుంది. ఒకవేళ ఆమె మెత్తనిదైతే బహిరంగంగానే మాటల వాతలు పెట్టి, వెంటాడి వేటాడి వేధిస్తూ ఉంటుంది. అదే నోరు తెరచి గట్టిగా బుద్ధి చెప్పి, తనను తాను రక్షించుకుంటే గయ్యాళి అనే బిరుదు కూడా ప్రదానం చేస్తుంది.
           ఇలా మహిళ జీవితపు ప్రతి పొరలో ఎన్నో తెలియని దుఃఖకోణాలు ఉంటాయి. భర్త కొట్టకపోయినా, తాగకపోయినా మంచివాడు అనే ముద్ర వేసి తెగ పొగిడి, స్త్రీని తన అదృష్టాన్ని తలచుకుని మురిసిపోమని కూడా సమాజం సూచిస్తుంది. నలుగురిలో భార్యని అవమానించినా, ఆమెకు స్వేచ్ఛ ఇవ్వకపోయినా అది అతినహజం అన్నట్టు చూస్తుంది. భర్త మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నా, అది చాలా మామూలు విషయంగా పరిగణిస్తుంది. అంతేకాక భార్య అతడికి తగినట్టు ప్రవర్తించలేదని ఆమెనే తప్పుబడుతుంది.
           మహిళ ప్రతి అడుగునీ, మాటనీ గుచ్చి గుచ్చి చూస్తూ, ఏ చిన్న అవకాశం దొరికినా విమర్శించడానికి, విరుచుకు తినడానికి సిద్ధంగా ఉన్న నోళ్ళు ఎన్నో ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళకు మరొక విచిత్రమైన పరిస్థితి. ఉద్యోగపు ఒత్తిళ్ళతో పాటు బయట ఎదురయ్యే వేధింపులు, చులకన చూపులు, శల్యపరీక్షలు ఉండనే ఉంటాయి. అవన్నీ ఇంట్లో చెప్పుకోలేని, సాంత్వన పొందలేని పరిస్థితులు అనేకం. పరాయి మగాడు ఏమైనా అన్నా, తాకినా అందులో మహిళ ఇచ్చిన చనువే కారణం అనే తీర్పులూ ఉంటాయి. ఇన్ని రకాల అవస్థల నడుమ ఆమెకు జీవితం దినదిన గండమై ఉంటుంది.
             అసభ్య పదజాలంతో అవమానించినా, తమ జీవిక కోసం కిమ్మనకుండా భరించే మహిళల అసహాయత గురించి వినే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి ప్రతి స్త్రీ అనుభవించే ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేనితనం వారిని మరింత కృంగదీస్తుంది. అవసరం ఉన్నంతవరకూ వాడుకునే యంత్రంగా స్త్రీని ఉపయోగించుకుని, ఆ అవిశ్రాంతంగా నడిచే యంత్రం కుంటుబడితే వదిలించుకుందామనుకునే వాళ్ళూ కోకొల్లలు. లోతుగా చూస్తే వివాహ వ్యవస్థలో ఎన్నో లొసుగులు, మరెన్నో ద్వంద్వ నీతులు. అంతెందుకు... ఈనాటికీ ప్లస్యూ మైనస్సూ అంటూ ఆడమగల తేడాల గురించిన నిర్వచనాలు ఉండనే ఉన్నాయి.
           తనదైన ఇంట్లోనే ఆమె పరాయిదై నిశ్శబ్జంగా దుఃఖిస్తుంది. తన అనుకున్న వాళ్ళే తనను తేడాగా చూస్తుంట,ే మాట్లాడుతుంటే, ఆమె చుట్టూ మనుషులున్నా ఒంటరితనం అనుభవిస్తుంది. ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో కోణాల్లో మహిళ వివక్షకు గురవుతోంది.
           అటువంటి మహిళల బాధాతప్త జీవితాల్లోని నలభై కోణాలను పరిచయం చేసే కథలే 'స్వయంసిద్ధ'లోని కథలు. ఈ సంకలనం అటువంటి అవస్థలను, కనబడని కన్నీళ్ళను కథలుగా వినిపిస్తుంది. ఒంటరి పోరాటాలను కళ్ళకు కడుతుంది. ఎన్నో ముళ్ళదారుల్లో ప్రయాణిస్తూ వాళ్ళు గర్వంగా ఎగరేసిన గెలుపు జెండాలు ఈ కథలు. ఇందులో సీనియర్‌ రచయిత్రుల దగ్గర నుంచి ఇదే తొలి కథగా రాసిన వర్ధమాన రచయిత్రుల వరకూ ఉన్నారు.
              'స్వయంసిద్ధ'లోని కథలను నలభై మంది రచయిత్రుల నుంచి సేకరించి ఎంతో శ్రమకోర్చి సంకలనం చేసిన భండారు విజయ గారికి, జ్యోతి గారికి వేవేల అభినందనలు. ఈ సంకలనం తప్పక చదవండి, చదివించండి. ఒంటరి మహిళల జీవన గాథలను, వారి బతుకు పోరాటాలను గురించి తెలుసుకోవడం, మార్పు కోసం కొంతైనా ప్రయత్నించి ఆశించడం మన బాధ్యత కదా! పుస్తకాల కోసం భండారు విజయ గారిని 8801910908 నంబర్‌లో సంప్రదించవొచ్చు.
 

- పద్మావతి రాంభక్త