Oct 07,2023 18:02
  •  ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు..

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023లో సౌతాఫ్రికా ప్లేయర్లు సెంచరీల మోత మోగించారు. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్‌ డికాక్‌ (100), రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, ఐడెన్‌ మార్క్రామ్‌ సెంచరీలతో కదంతొక్కారు. ఫలితంగా సౌతాఫ్రికా 50 ఓవర్లలో 428 పరుగులు చేసింది. డికాక్‌ 84 బంతులు ఎదుర్కొన్న 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి, ఆ వెంటనే పతిరణ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 103బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన డస్సెన్‌ సమరవిక్రమ బౌలింగ్‌లో దునిత్‌ వెల్లలాగేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. డికాక్‌ వెనుదిరిగిన తరువాత క్రీజులోకి వచ్చిన మార్క్రమ్‌ ఆకాశమే హద్దుగా చేలరేగి ఆడాడు. కేవలం 50 బంతుల్లోను 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి దిల్షన్‌ మధుశంక బౌలింగ్‌లో రజితకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 32,  డేవిడ్‌ మిల్లర్‌ 21 బంతుల్లో 39, మార్కో జాన్సెన్ 12 పరుగులు చేశారు. సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమాను (8) దిల్షన్‌ మధషంక ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి నిరాశపరిచాడు.  శ్రీలంక బౌలర్లలో దిల్షన్‌ మధషంక 2, రజిత, పతిరణ, దునిత్‌ వెల్లలాగే తలో వికెట్‌ తీసుకన్నారు.

  • దక్షిణాఫ్రికా పేర మూడు రికార్డులు

ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు పలు రికార్డులు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్‌తో పాటు ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్స్‌ సెంచరీ, 49బంతుల్లోనే మార్‌క్రమ్‌ శతకం వంటి రికార్డులను నెలకొల్పింది. అరుణ్‌జైట్లీ మైదానంలో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. వన్డే ప్రపంచకప్‌లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 2015లో అఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియా చేసిన 417పరుగులు చేయగా.. తాజాగా ఆ రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. అలాగే ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (100) డసెన్‌(110), మార్‌క్రమ్‌ (106) సెంచరీలతో కదం తొక్కి మరో రికార్డును నెలకొల్పారు. అలాగే మార్‌క్రమ్‌ కేవలం 49 బంతుల్లో 14 ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్‌ ఓ బ్రయాన్‌ పేరిట ఉంది. ఓబ్రయాన్‌ 2011 వరల్డ్‌కప్‌లో బెంగళూరులో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా 50 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఇక వన్డేల్లో వేగంగా సెంచరీ చేసిన రికార్డు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. అతడు కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు.