గొప్ప సాహిత్యానికి పుట్టినిల్లుగా విజయవాడను చెప్పుకుంటాం. కానీ కొంతకాలం నుంచి ఈ ప్రాంతం సాహిత్య క్షామంతో కొట్టుమిట్టాడుతోంది. ఒకానొక సమయంలో కరోనా కవుల, రచయితల కదలికలను, కలయికలను కట్టడి చేసింది. ఆన్‌లైన్ మీటింగుల ఒరవడి కారణంగా కవులు, కలాలు కలుసుకుని మాట్లాడుకోవడం అరుదై పోయింది ! కోవిడ్ తీవ్రత, హడావిడి తగ్గాక అక్కడక్కడా సాహిత్య చినుకులు మళ్ళీ కురవడం మొదలైంది. పుస్తకాల విడుదలలు, కవితల పోటీలు, అవార్డులు, రివార్డులు అందుకోవడాలు వంటి ఎన్నో ముచ్చట్లు, ముబారక్‌ల సందడితో ... 2022 మురిసిపోయింది. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండాలి? ఎలా మొదలవ్వాలి? అన్న ఆలోచనలోంచి విజయవాడలోని సాహితీ మిత్రులు .. ఆరోజు సాయంత్రం ఓ చిన్న కలయిక ఏర్పాటు చేసుకున్నారు. కవిత్వ పఠనంతో 2023ని ఆహ్వానించారు. ఇలా ఒక కవిత్వపు సాయంత్రాన్ని అందంగా డిజైన్ చేశారు కవిమిత్రులు తంగిరాల సోనీ, అనిల్ డానీ. 'అనేక' బుక్‌స్టాల్ వేదికగా అందరూ కలుసుకున్నారు. ూఱసవ a జూఱవషవ శీట ఱషవ శీఅ a ష్ట్రశ్‌ీ ర్‌శీఙవ ్‌ష్ట్రవ జూశీవఎ ఎబర్ తీఱసవ శీఅ ఱ్‌ర శీషఅ ఎవశ్ర్‌ీఱఅస్త్ర అంటారు రాబర్ట్ ఫ్రాస్ట్. జనవరి 1 సాయంత్రం సాహిత్యం సమయాన్ని అలా కరిగించేసింది.
మత విద్వేషాలు మిన్నంటుతూ అందరి మీద అగ్ని వర్షం కురుస్తున్న వేళ ... కవి సర్వేశ్వరావు తన కవిత 'మా వాడ తల్లి- సిరిశాసి'లో ఇలా అంటారు : 'మీ ఒళ్ళంతా మతవిద్వేషాల జలదరింపులు మర్కట కర్కాటకాలే / ఐనా గొడ్డు మాంసం నా రక్తం నా శరీరం / మా అస్తిత్వ చైతన్యం' అంటూ తనదైన గొంతుతో మత విద్వేషాలను రెచ్చగొడుతూ మనుషుల్ని పావుల్ని చేసి ఆడిస్తున్న వ్యవస్థను దుయ్యబట్టారు. మరో బలమైన కవి బంగార్రాజు కంఠ... సైలెంట్‌గా కనిపిస్తూ అణుబాంబులాంటి కవిత్వాన్ని సృజియిస్తారు. ఒక మతం గొప్పదని, మరొక మతం హీనమని భావించే కొంతమందిని ఉద్దేశించి రాసిన 'గురివింద కాండ' కవిత వినిపించారు. చాలా బలమైన వాక్యాలను అర్థవంతంగా, సరళంగా రాశారు. 'బాలకాండలూ / సుందరకాండలూ ముగిసిపోయాయి / దేశంలో ఇప్పుడు గురివిందకాండ నడుస్తోంది / నువ్వు పెట్టేది దేవుడు తినడు / దేవుడు నీ నోటిక్వివ్వడు / సర్వమత సారం ఒకటే సర్వాంతర్యామీ ఒకడే/ నమ్మం కుదరకపోతే/ అసలు దేవుడే లేడని ప్రకటించండి'' అని ముగించారు. మరో ప్రముఖ కవి మోహన్ రాంప్రసాద్ ... హైకూలతో చెణుకులు విసిరుతూ వావ్ అనిపించుకుంటారు. 'మా ఊరు ఒక హైకూ' అని తాజాగా ప్రచురించిన తన పుస్తకంలోంచి కొన్ని అద్భుతమైన వాక్యాలను చదివి వినిపించారు. 'చింతతోపుల్లోంచి మా ఊరిని చూస్తే చందమామ కనిపిస్తుంది/ నిండు పున్నమి నాడు చందమామను చూస్తే మా మేనమామ కనిపిస్తాడు/ మా అమ్మ ఒడి/ వేయి గదుల బడి / బతకడం నేర్పింది/ ఆకాశంలో పూచేవి/ చివరిసారిగా మమ్మల్ని చూడాలనుకున్న మాస్టారుకి / కన్నీటి పొర అడ్డొచ్చింది / ఆఖరి రోజు మా మాస్టారు నా తల నిమిరారు/ నాకు కవిత్వం తలకెక్కింది.' అంటూ చిట్టి చిట్టి వాక్యాలతో చిక్కనైన చక్కని కవిత్వం చెప్పారు.
ప్రముఖ కవయిత్రి మందరపు హైమావతి తన 'ఇస్త్రీ అమ్మాయి' కవితను వినిపించారు. 'అమ్మా, అక్కా అని పిలుస్తూ ఆ పదానికి ముందు ఒక అక్షరాన్ని చేర్చి / నా పేరునే ఒక బూతు పదంగా మలిచి/ తుంటరి మాటలు రువ్వే ప్రపంచంలో నిలువెత్తు ఆత్మగౌరవంగా ఆమె/ రాత్రి నక్షత్రాలు నవ్వగానే తోలు బొమ్మలాటలో తెర మీద కదిలే బొమ్మల్లా ఒక్కొక్కరు వెళ్లిపోగానే గంట కొట్టాక/ పిల్లలు లేని బడిలా/ బంధువులందరూ తరలిపోయిన పెళ్లిపందిరిలా ఒంటరిగా ఇస్త్రీ బండి' అంటూ ఎంతో ఆవేదనతో కవిత ముగించారు. మరొక కవయిత్రి వైష్ణవిశ్రీ ... 'బాల్యం రెక్కలు విరించిందెవరో' అంటూ కొన్ని బలమైన వాక్యాలను వినిపించారు. 'చందమామ, బాలమిత్ర కథల్లో నువ్వూ నేనే / భట్టి విక్రమార్కుడు మన పసినాన్న హీరో / బాల్యం అక్కడే ఆగిపోయిందా లేదు కదా యవ్వనం చేయి చాచి పిలిచిందిగా / హార్మోన్లు నెత్తుటి ప్రవాహమై కాసింత భారాన్ని దింపుకున్నాయిగా / శిధిలమైన బాల్యమా / నిన్నెక్కడని వెతకను / ఏం చేయాలో తెలియక ఒంటరి కోడి పిల్లలా నేను' అంటూ బాల్యం గురించి అందులో ఉండే ఆనందం, ఆవేదన గురించి వివరించారు.
సీనియర్ కవి శిఖ ఆకాష్ తన పదునైన వాక్యాల చెర్నాకోలతో 'ప్రకటన' అంటూ ఒక అద్భుతమైన కవితను చదివారు. 'కాషాయం పొగలు మింగేసిన కాలమా/ నియంతల్ని కుప్పకూల్చినా కాలమా/ నువ్వెలా వచ్చినా భయపడేది లేదు/ మనువు అంత్యక్రియలు చేయడానికే/ మతోన్మాదుల మరణశయ్యను సిద్ధం చేయడానికే వేచి వున్నాం/ రండి ముఖంలో అద్దం చూసుకుందాం/ చరిత్రను నడిరోడ్డు మీద నగంగా ఆరేద్దాం/ నన్ను అశుద్ధుడిని చేసినవాడా/ నీ సమస్త మురికిని శుద్ధి చేసే అసలు మనిషిని నేనేనని ప్రకటిస్తున్నా' అంటూ కొండల్ని కూడా పిండి చేసే వాక్యాలతో అందరినీ అలరించారు.
ప్రముఖ కవి సరికొండ నరసింహరాజు 'కాలం పూలతోటలో అన్వేషిస్తూ' అంటూ తన కవితను బలమైన గొంతుతో చదివి వినిపించారు. 'ప్రాణ స్నేహితుడిలా వెంటే ఉంటూ/ ఎందుకలా వెన్నుపోటు పొడుస్తావ్/ ఎంత ఆత్మీయత నటిస్తావ్/ మాటేసి మాన్ ఈటర్‌లా కబళిస్తావ్ కదా/ నీడలా ఉంటూ నియంతలా మారతావ్/ నరహంతకివవుతావేం/ నీ గెలుపు కోసం నిత్యం ఓడిపోతూనే ఉంటాం కదా / నువ్వు పాడబోయే రాగమేదో సెలవిస్తే/ మా దారి దీపమవుతామని ఆశించాం/ ఒక పూలముఖంతో వచ్చి మా గుండెల్లో గడియారం ముళ్ళు గుచ్చి/ నువ్వు కాలుష్య పతాకివి, విభజన సునామీవి / కనిపించకుండా కబళించే కరోనావే' అంటూ తన పదునైన కవిత వినిపించారు.
ఈ కలయికకు కారణమైన యువకవి తంగిరాల సోనీ.. 'నా ప్రియమైన నూతన సంవత్సరమా!' అంటూ ఇక్కడ ఎప్పుడో / మనుషులు చిగురించడం మానేసారు/ విడి ఆకాశంలా/ విడిపోతూ వాడిపోతున్నారు/ నది నురగల్లాంటి / నవ్వులే లేకుండా పోయాయి/ సముద్రంలా స్నేహమే చేయలేక పోతున్నారు' అంటూ ... 'ఇకనైనా అంతా సమానత్వం రావాలి, స్త్రీలను గౌరవించే సమాజం రావాలి' అంటూ వినసొంపుగా చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.
మరొక కవి, కార్యక్రమ బాధ్యుడూ అనిల్ డానీ తనదైన శైలిలో 'నల్ల దారం' కవిత వినిపించాడు. 'అసలు సంగతి అంతా చూపులోనే ఉంది/ అంచనా వేయడానికి నేర్పు అక్కర్లేదు / పీడిత సమూహాల్లోకి రాళ్లు విసరడమే ముఖ్యం/ అంతా నలుపే/ ఆదిమ ద్రావిడ రాజులు రాక్షసుల్లా చెక్కబడతారు/ వేదవాక్యాలు పాళీల్లోంచి/ పాలిపోయిన రంగులన్నీ ఒలికిపోయి/ మూల వాసులు దేహాల్ని అసహ్యించుకుంటాయి / అసలు నిజాలన్నీ తాళపత్రాల కింద కప్పెట్టి/ అసత్యాలన్నీ కొత్త రంగు పులుము కుంటాయి/ రంగు మీద ప్రేమ ఎక్కువైనా దేశంలో / ఎలుక తోలు రంగు కూడా సామెతైపోతుంది / దేహం మీదకు పరుల దృష్టి పడకుండా కాలికి కట్టుకున్న నల్ల దారంలా ద్రావిడ జాతి తనకు తాను ఫణంగా ఒడ్డుకుంటూ'' అంటూ నలుపు రంగు గురించి మంచి కవితను వినిపించారు.
రజియా బేగం ఇప్పుడిప్పుడే అలతి అలతి పదాలతో ఒక్కో ఇటుకను చేర్చుకుంటూ కవిత్వపు ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె తన 'స్త్రీ శక్తి' కవితను చదివి వినిపించారు. మంచి కవిమిత్రులతో సావాసం చేస్తూ కవిత్వపు తోటలో ఒక పూవై విరబూస్తున్న విజయశ్రీ దుర్గ 'వృద్ధాప్యం' మీద తన కవితను చదివి వినిపించారు. మనసుకు వృద్ధాప్యం వరమో, శాపమో/ లోపల ఏదో గుబులు/ చెప్పుకోలేని నిరాశ నిస్ప ృహలు అంటూ తనదైన గొంతు వినిపించారు. కలిమిశ్రీ ఒక చిన్న ఉల్లిపాయ బాంబు లాంటి చిట్టి కవితను వినిపించారు. 'నిన్న ఆ ఇంటిపై ఎగిరే పార్టీ పతాకాలు చెప్పేవి/ నేడు ఆ ఇంటి గుమ్మం ముందు విసిరివేయబడుతున్న దినపత్రికలు చెబుతున్నాయి/ ఆ ఇంటాయన ఏ పార్టీకి చెందిన వాడోనని' అంటూ ముగించారు. మరో కవి గడ్డం విజయరావు 'మానవత్వమా.. మత్తు కౌగిలి' అంటూ తన కవిత్వాన్ని చదివి వినిపించారు. మతం మత్తులో జోగుతున్న మానవత్వమా మేలుకో / మనోభావాలు అందరికీ ఉంటాయని తెలీదా/ ప్రశ్నించడమే నేరమైన ఈ రాజ్యంలో మానవత్వమా మేలుకో/ పైడి తెరేష్‌లా, మద్దూరిలా, కత్తి మహేష్‌లా, భైరి నరేష్‌లా అప్పుడప్పుడు ప్రశ్నిస్తాయి/ మతోన్మా దాన్ని పెంచాలని చూసే దురాచారులారా/ తత్వాన్ని అడగండి/ మానవత్వాన్ని మేల్కొలపండి' అంటూ ప్రస్తుత పరిస్థితిపై అప్పటికప్పుడు రాసి కవితను వినిపించారు.
విజయవాడకు చెందిన అమూల్యచందు ''సేమ్ టు సేమ్'' కవితలో తన ఆవేదన వ్యక్తం చేశారు. 'నువ్వు ఏ వయసులో ఐనా ఉండొచ్చు/ కానీ ఎవరో నీలో రగిల్చిన అగ్నితో/ 365 రోజులు మండుతూనే ఉంటావు.. అబద్దాన్ని చూస్తూ, తిట్టుకుంటూ/ నిజాన్ని నగంగా బయటపెట్టలేక పళ్ళు నూరుతూ ఉంటావు.. పాత గోడ మీద/ కొత్త కేలండర్ అంతే/ మిగతాదంతా సేమ్ టు సేమ్..' అని తన కవిత వినిపించారు.
ప్రముఖ కవి అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ 'ఈ సమావేశంలో భిన్న అస్తిత్వాల కలయిక జరిగింది. ఇప్పుడు కావాల్సింది ఇదే' అన్నారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ, 'ఈ రోజు రంగురంగుల సూదులతో, దారాలతో నేసిన కవిత్వ నేత అద్భుతంగా ఉంది. కవి తన పదాన్ని రోడ్డు మీద వదులుతాడు రోడ్డు మీద ఆ పదం సంచరిస్తూ మనిషికి ఢకొీన్నప్పుడు ఒక పేలుడు సంభవిస్తుంది. అదే కవిత్వం.. ఇక్కడ చదివిన కవితలన్నీ ఎవరెవరినో ఢకొీంటాయి. రకరకాల పేలుళ్లు సంభవిస్తాయి. ఇక్కడ జరిగిన ఈ కవి సమ్మేళనమే ఒక పెద్ద పేలుడు' అని కవిత్వానికి కొత్త అర్థం చెప్పి అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
శ్రీశ్రీ విశ్వేశ్వరరావు ఈ సమ్మేళనానికి వచ్చి కవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇకనుంచి ప్రతి ఏడాదీ జనవరి 1న విజయవాడలో కవి సమ్మేళనం తప్పక జరుపుకోవాలనే ఉద్దేశంతో 'ఒక కలయిక - అనేక కలాలు' కార్యక్రమాన్ని తంగిరాల సోనీ, అనిల్ డ్యానీని సంప్రదించి రూపకల్పన చేశారు ప్రముఖ సీనియర్ కవి శిఖా ఆకాష్. ఈ కార్యక్రమాన్నీ ఆసాంతం వీక్షించేందుకు చిలకలూరిపేట నుంచి ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ విచ్చేసారు. ''మనుషుల్ని విడదీసి పాలిస్తూ, వేధిస్తున్న అంధయుగపు పాలకులు రాజ్యం చేస్తున్న ఈ కాలంలో ప్రగతిని కాంక్షించే కలాలు మరింత పదునెక్కాలి, బలపడాలి'' అంటూ సాహిత్య ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ ఒక సందేశాన్ని పంపించారు. సభ ఆద్యంతం ఎంతో ఉత్తేజంతో సాగింది. ఇకనుంచి ప్రతినెలా విజయవాడలో ఆత్మీయ సాహిత్య సమావేశాలు, సభలు, కవి సమ్మేళనాలు కొనసాగించుకోవాలని వచ్చిన కవులు అందరూ అభిప్రాయపడ్డారు.
- అమూల్యచందు కప్పగంతు
9059824800










