ప్రజాశక్తి - విజయవాడ : సమాజ మార్పునకు కమ్యూనిజమే మార్గమని.. రానున్న రోజుల్లో ఢిల్లీ ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందని తనకు నమ్మకం ఉందని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సిపిఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా జరుగుతున్న 4వ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కోశాధికారి ఆర్. పిచ్చయ్య అధ్యక్షతన ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భరద్వాజ మాట్లాడుతూ.. అనేకమంది కళాకారులను సినీ రంగానికి అందించిన ఘనత ప్రజానాట్యమండలిదేనన్నారు. సినీ రంగానికి కళాకారులను, కళారూపాలను అందించిన ప్రజానాట్యమండలికి కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ సహకారం అందించాలన్నారు. మరో అతిథి సినీ మాటల రచయిత, నటులు సంజీవి మాట్లాడుతూ 'ఎవరు రా కూసింది కమ్యూనిజం చచ్చిందని' అన్న సినారె గీతం ఈ నెల 14న జరిగిన మహాప్రదర్శనలో ఎర్ర సముద్రాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. కృష్ణానది కంటే ఉధృతంగా ఎర్రదండు ర్యాలీ జరిగిందని గొప్పగా అభివర్ణించారు. ప్రజానాట్యమండలికి ఒక మంచి నాటికను నాటకాన్ని రచించి అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కె. శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇప్టా జాతీయ కార్యదర్శి గని, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు చంద్రానాయక్, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య పాల్గొన్నారు. ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గురప్ప వందన సమర్పణ చేశారు.
ఆలోచింపజేసిన సాంస్కృతిక ప్రదర్శనలు
కర్నూలు ప్రజానాట్యమండలి అధ్యక్షులు నాగరాజు, డాన్స్ మాస్టర్ కరీముల్లా ఆధ్వర్యంలో కళాకారులు, చిన్నారులు 'పాడవోయి భారతీయుడా' పాటకు నృత్య ప్రదర్శన చేశారు. విజయవాడ నగర ప్రజానాట్యమండలి వారిచే 'మనుషులమంతా ఒక్కటే (మైమ్) ప్రదర్శన ఆలోచింపజేసింది. కుల, మతాలు లేవని భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనం అని, అభ్యుదయ సమాజం కోసం అంటూ ఈ ప్రదర్శన సాగింది. లంకా దుర్గారావు దర్శకత్వంలో ప్రదర్శించిన మైమ్ కళారూపంలో కళాకారులు డి. సూరిబాబు, ఎస్‌కే. నజీర్, కేవీ. భాస్కరరావు, కాళ్ల చిన్నప్ప, ఎస్. రాము పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజానాట్యమండలి కళాకారులచే 'రాజకీయ భాగోతం' నృత్య గేయనాటిక' విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలోని రాజకీయ పరిస్థితులను కళ్లకుకట్టినట్లుగా చూపారు. రాష్ట్ర ప్రజానాట్యమండలి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. రామకృష్ణ, అంజయ్యల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. గాయకులు చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, వెంకటరాయుడు, ఆర్. రామారావు. సి.రవి, మారెళ్ల శ్రీనివాసులు ప్రజా ఉద్యమ గేయాలను ఆలపించారు. సిపిఐ 24వ మహాసభల సందర్భంగా ఎస్‌ఎస్.కన్వెషన్‌లో జరుగుతున్న ప్రతినిధుల సభా వేదిక వద్ద ప్రదర్శించిన కళా రూపాలు ఆకట్టుకున్నాయి. కేరళ వారిచే కార్పొరేట్ విధానంపై ప్రదర్శించిన 'మైమ్' నాటకం ఆకట్టుకుంది. తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహా దళం చండ్ర రాజేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఒగ్గుకథ అలరించింది.
నేటి సాంస్కృతిక కార్యక్రమాలు
సిపిఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో సోమవారం ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ప్రజానాట్యమండలి వారిచే 'వీర తెలంగాణ' ఒగ్గుకథ. గుంటూరుజిల్లా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారిచే 'ఓం హాం.. ఓ హం..' నాటిక ప్రదదర్శించబడుతుంది. నాటిక రచన వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. ఐదురోజులపాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల చివరిరోజు సభలో సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ సినీ గేయ రచయిత చైతన్య ప్రసాద్, సినీ దర్శకులు బాబ్జీ పాల్గొననున్నారు.












