
'గార రంగనాథం' బహుముఖ ప్రజ్ఞాశాలి. పద్యం, వచనం, విమర్శనం రాస్తారు. గత 8 ఏళ్లుగా ఓ చిన్న పట్టణంలో 'రాజాం రచయితల వేదిక'ను చక్కగా నడుపుతున్నారు. ఈ వేదిక 2022-23 వ సం:లో మూడు పుస్తకాలను వెలువరించింది. అవి 'ఆజరి, విస్మత కళింగాంధ్ర ప్రభ, సూక్తి రత్న మంజరి. రంగనాథం ప్రతినెలా ప్రముఖ సాహిత్యీ వేత్తలను ఆహ్వానించి, తమ వేదికపై ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారు. కళింగాంధ్ర అస్తిత్వ వేదనను వివరిస్తూ పలు పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. ఆయా వ్యాసాలలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రస్తావిస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా ఉత్తరాంధ్రకు దక్కాల్సిన వాటా గురించి నిగదిస్తారా ఉత్తరాంధ్రులు వలసపోవడం పట్ల ఆందోళన, ఆర్థ్రత కనిపిస్తాయి. అనేక వనరులున్న ఉత్తరాంధ్ర వెనుకుబాటుకు కారకులెవరని ప్రశ్నిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలను ఏకతాటిపై ఉంచాల్సిన అవసరాన్ని వక్కాణిస్తు వివిధ రంగాల మేధావులను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాహిత్య యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. మరుగునపడిన సాహితీవేత్తలను ఈ 'విస్మృత కళింగాంధ్ర సాహితీ ప్రభ' పరిచయం చేస్తోంది.
ఈ పొత్తములో 30 వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు కళింగాంధ్ర అస్తిత్వాన్ని పలికిస్తున్నాయి. కళింగాంధ్ర మూలాలను తెలియపరుస్తా. ఈ నేలపై సాగిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలను కళ్ళ ముందు పెంచుతాయి. వివిధ పోరాటాలను ఎరుక పరుస్తా గురజాడ, శ్రీశ్రీ, చాసో, రావిశాస్త్రి, కారా, బలివాడ, పతంజలి, భూషణం, సీరపాణి, అట్టాడ, గంటేడ, చింతకింది మొదలగు వారు ప్రామాణికమైన సాహిత్య సజన చేశారు. కానీ ఈ నేలపై పుట్టి విశేష సాహిత్య సేవ చేసిన మరికొంత మంది మరుగున పడిపోయారు. అలా మరుగున పడిన వారిని వెలికి తీసే ఈ పుస్తకం ప్రయత్నమే.
ఇందులో 'ఉత్తరాంధ్ర ప్రాచీన సాహిత్యం' అనే వ్యాసాన్ని సంపాదకులు రాశారు. ఈ ప్రాంతానికి శాతవాహనులు కంటే ప్రాచీన చరిత్ర ఉందని రుజువు చేసేది. క్రీ:పూ 192 లో యువరాజుగా ఖారవేలుడు ఉంటూ, తదనంతరం క్రీ:పూ 183 లో తొలి కళింగ చక్రవర్తిగా త్రికళింగాన్ని శ్రీముఖలింగం రాజధానిగా చేసుకొని పరిపాలించారని రచయిత సాధికారికంగా చెబుతారు. శ్రీకాకుళం జిల్లాలో గల దీర్ఘాశి శిలాశాసనంలో తేటగీతితో కూడిన సమగ్ర సీస పద్యం ఉంది. దీన్ని రాజరాజ దేవేంద్ర వర్మ మంత్రి 'బనపతి' క్రీ:శ 1077 లో రాయించాడు. ఈ సీస పద్యం నన్నయ కాలానికి చెందినదిగా ఎరుకపరుస్తూ, ఈ విధంగా ఉత్తరాంధ్ర సాహిత్యం ప్రాచీనమైనదని రచయిత రూఢి చేస్తున్నారు. 11వ శతాబ్దం నుండే సింహాచలం వైష్ణవ క్షేత్రంగా వెలుగొందింది. కష్ణమాచార్యులు 'సింహగిరి వచనాలు' రాశారు. దీన్నే తెలుగు సాహిత్యంలో తొలి వచన రచనా గ్రంథంగా పేర్కొంటారు. ఉత్తరాంధ్రలో చింతలపూడి ఎల్లన్న రాధామాధవం, తారక బ్రహ్మరాజీయం, విష్ణుమాయా విలాసం అనే గ్రంథాలు రాశారు. వీటిలో రాధామాధవాన్ని శ్రీకష్ణదేవరాయలు మెచ్చుకొని సత్కరించారు. వీరేగాక మరికొంత మంది గూర్చి ప్రస్తావన ఉంది.
'నలచరిత్ర ప్రబంధం-బెహరా రామకష్ణ కవి' గణేశ్వరరావు రాసిన వ్యాసంలో నలచరిత్ర 1444 గద్య పద్యాలతో కూడిన ఐదాశ్వాసాల కావ్యమనీ, ఈ గ్రంథం ప్రతి ఒకటి రచయిత వద్ద శిథిóలావస్థలో ఉందనీ, దీన్ని ఎవరైనా పునర్ముద్రణ చేయవలసిందిగా రచయిత కోరుతున్నారు.
'విచిత్ర రామాయణం' అనే వ్యాసాన్ని రంగారావు రాశారు. కళ్లేపల్లి వెంకట నరసింహమూర్తి రాసిన ఈ రామాయణం గొప్ప కావ్యమన్నారు. ఇది 4,136 గద్య పద్యాలతో నిర్మితమైంది. ఇందు వాల్మీకి రామాయణానికి భిన్నంగా పలు కథాంశాలున్నాయి.
డా: డి.వి సూర్యారావు రాసిన 'ఉత్కళాంధ్ర సాహితీ విక్రమం' అనే వ్యాసంలో రాజా విక్రమదేవ వర్మ సాహితీ సేవను కొనియాడారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరు చెప్పగానే రాజావారే తళుక్కుమని మెరుస్తారు. 1911-49 మధ్య సమకాలీన పత్రికల్లో 50 కి పైగా వీరి రచనలు ప్రచురితమయ్యాయి. వీరి కథానికలు మధునాపంతుల సత్యనారాయణ గారి 'ఆంధ్రా' పత్రికలో అచ్చయ్యాయి. వాటిలో పయనపు చెలికాడు, ముసలి మొగుడు ముఖ్యమైనవి.
గంటేడ గౌరునాయుడు 'ఒకరు కలియుగ వాల్మీకి-మరొకరు కర్షక మహర్షి' అనే వ్యాసమందించారు. ఈ వ్యాసంలో పార్వతీపురం ప్రాంతానికి చెందిన గిడిజాల లక్ష్మణ దాసు, ద్వారపు రెడ్డి అప్పలనాయుడు సాహిత్య సేవలను ప్రస్తావించారు. 'కాపువారమమ్మా/ మేము కాపువారము/ముజ్జగముల కెల్లా/పంట కాపులై కుంటలు తవ్వీ/చట్లో అంబలి చంకన పిల్లా/వెంటను మగడు ఏరు బూసుకొని/లేనిపోని యవసాయం చేసి' ఇలా సాగుతోంది లక్షణదాసు పాట. తత్వగీతాల్లో ఎక్కువ పదాలు వ్యవసాయ సంబంధమైనవి ఉండడం విశేషమంటారు గంటేడ. ద్వారపు రెడ్డి శ్రీకష్ణ ధర్మ విజయం రాశారు. ఈ గ్రంథ నామం వద్ద 'రైతులకు, ఉపాధ్యాయులకు, దేశాభిమానులకు వేదం' అనే ఉపశీర్షిక ఉంది. అంటే ఇది రైతులకు, ఉపాధ్యాయులకు ఉద్దేశింపబడిన గ్రంథమంటారు.
'అల్లంసెట్టి వారి అల్లిక జిగిబిగి' అనే వ్యాసాన్ని గార సీతారత్నం రాశారు. అల్లంశెట్టి సూర్యనారాయణ చేనేత వత్తి చేస్తూ, కవిత్వం రాయడం విశేషం. తాను రచించిన నాటకాల్లో పాత్రోచిత భాషనే వాడేవారు. రామాయణ సారస్వత దర్శనం, రసిక జన మనోభిరామ కావ్య విమర్శనం అనే విమర్శక గ్రంథాలను రాశారు.
'లఘువు అనుకున్న అలఘువు' అనే మేడూరి సత్యనారాయణ మూర్తి వ్యాసంలో గుండుగోల జగన్నాథ శాస్త్రి ఉమా కామేశ్వర శతకం, వేంకటేశ్వర శతకం, సూర్య శతకాలను పరిచయం చేశారు.
డా: అల్లంసెట్టి చంద్రశేఖరరావు రాసిన 'కళింగంలో కనకాభిషేక కవి' అనే వ్యాసంలో మాడుగుల వెంకట సూర్య ప్రసాదరావు కవి గూర్చి తెలిపారు. ఈయనవి అద్భుత రామాయణం చిత్త ప్రబోధము, సూర్య స్తవ నక్షత్రమాల, ముకుంద మాల నేడు లభ్యం. ఈయనను రచయిత గొప్ప విద్వాంసునిగా ప్రస్తుతిస్తూ, కళింగాంధ్ర కంఠాభరణం చరిత్ర పొరల్లో మగ్గిపోవడం బాధాకరమంటాడు.
'కావ్యాన్ని మెరిపించిన శీర్షిక భక్త కైకేయి' అనే వ్యాసాన్ని కోటిబాబు రాశారు. కైకేయిని స్వార్థపరురాలు అంటుంది లోకం. కానీ ఉరిటి సూర్యనారాయణ నెగిటివ్ పాత్రకు ఉదాత్తతను చేకూర్చి ప్రబంధ రచన చేయడం విశేషం.
'రామవరపు కవులు' వ్యాసంలో రామవరపు నర్సింగరావు రాసిన 'అనామధేయుడి ఆత్మకథ' అనే సీరియల్ గురించి చెప్పారు. ఇంకా 'చుట్టంచూపు, సుందరప్ప గారి విందు భోజనం' వంటి హాస్యకథలు రాసినట్లు చెప్పుకొచ్చారు.
'ఆధునిక యుగంలో మధూదయం' అనే వ్యాసంలో సుబ్బారావు, ఉప్పాడ రాజారావు గారి 'మధూదయం' అనే ప్రబంధం గురించి వివరించారు.
'కవిలో కళాకారుడు బుడితి' అనే వ్యాసంలో మానాపురం, బుడితి రామినాయుడు విశేష ప్రతిభాపాటవాలను చర్చించారు.
'బహుజన భక్తి కళారూపం భజన' ను డా: ఆల్తి మోహనరావు రాశారు. భజన విశిష్టతను, ఉత్తరాంధ్రలో భజన ప్రాధాన్యతను గూర్చి చక్కగా చెప్పారు.
'సురభిళ పద్యం-గెడ్డాపు సత్యం' లో రమణమూర్తి, సత్యం మాస్టారి సాహితీసేవను గుర్తుచేశారు.
ఈ వ్యాస సంపుటిలో బొంగు సూర్యనారాయణ, నేతేటి నరసింగరావు, యామన బసవయ్య, కణుగుల వేంకటరావు, వాండ్రంగి రామారావు, పిళ్లా చింతప్పడు, బూరాడ గున్నేశ్వర శాస్త్రి, చిగురుకోట వేంకటరమణమూర్తి, మానాప్రగడ శేషసాయి మొదలగు వారి గూర్చి ఉంది. ఇందులో రాజాం ప్రాంత సాహిత్య చరిత్ర గూర్చి సంపాదకుడు రాసిన వ్యాసం, బరంపురం తెలుగు సాహిత్యం గురించి డా: తుర్లపాటి రాజేశ్వరి రాసిన వ్యాసం పాఠకులను అలరిస్తాయి. ఇందు ప్రాచీన, ఆధునిక సాహిత్యం మిళతమై ఉన్నది.
ప్రముఖ కవులు ఎస్.టి జ్ఞానానందకవి, వంగపండు ప్రసాదరావు, గార శ్రీరామ్మూర్తి లాంటి వారిపై కూడా వ్యాసాలు ఉన్నాయి. వీరు కనుమరుగైనవారు కాదు. కానీ ఈ గ్రంథరాజంలో నిబిడీకతం చేయడంలో సంపాదకుని ఆంతర్యం ఏమంటే, వీరు కూడా మరగునపడతారేమోనన్న భయమే కారణమనవచ్చు.
1940లో అడిదం రామారావు 'విస్మత కళింగాంధ్ర కవులు' అనే గ్రంథాన్ని ముద్రించారు. ఇందులో ఉన్న కొట్రా, కళ్లేపల్లి కవుల చరిత్రను ఈ సాహితీ ప్రభలో కూడా పొందుపరచడం గమనార్హం. సుదీర్ఘ కాల వ్యవధిలో రంగనాథం తిరిగి కనుమరుగైన కళింగాంధ్ర కవులను తన సంపాదకత్వంలో పరామర్శించడం అభినందనీయం.
ప్రతులకు: సంపాదకులు, గార రంగనాథం, 9885758123.
పిల్లా తిరుపతిరావు
7095184846