- సుధాకర్ సహా మరో ఇద్దరు అరెస్టు
- నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లలో పలువురు బిజెపి నాయకులు
- 10 వేల మంది నుంచి రూ.400 కోట్లు వసూలు చేసినట్లు అంచనా
ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి : రూర్బన్, స్మార్ట్ విలేజ్ పథకం కింద క్లస్టర్ ఎగ్జిక్యూటివ్, క్లస్టర్ అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడిన వారిలో ఒక్కొక్కరూ కటకటాలపాలవుతున్నారు. బిజెపి నర్సీపట్నం పూర్వ ప్రధాన కార్యదర్శి, స్మార్ట్ విలేజ్ రీజనల్ మేనేజర్ ఇండిపూడి సుధాకర్ అరెస్టయిన వారం రోజులకు నర్సీపట్నానికి చెందిన రుత్తల హరిబాబు, తణుకుకు చెందిన కె.శివను సిఐడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. క్లస్టర్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు జారీ చేసి నిరుద్యోగులను మోసగిస్తున్న వైనాన్ని గతంలోనే 'ప్రజాశక్తి' వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో బిజెపికి చెందిన నాయకులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని 2021 ఆగస్టు 21న 'బిజెపి నేతల స్మార్ట్ దోపిడీ' అన్న శీర్షికన ప్రధాన సంచికలో కథనం ఇచ్చింది. అప్పటి నుంచి నిరుద్యోగులను మోసగిస్తున్న వైనంపై అనేక కథనాలు వెలుగులోకి తెచ్చింది. మోసపోయిన నిరుద్యోగుల ఫిర్యాదుపై విశాఖపట్నం రీజియన్ సిఐడి అధికారులు విచారణ ప్రారంభించారు. సుధాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తరువాత మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని దాదాపు పది వేల మంది నుంచి రూ.400 కోట్ల వరకు వసూలు చేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిలో అత్యధికులు బిజెపికి చెందిన వారున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై 2021లో బిజెపి త్రిసభ్య కమిటీని నియమించింది. డబ్బుల వసూళ్ల వ్యవహారంలో బిజెపికి చెందిన వివిధ స్థాయిల్లోని నాయకులున్నారని గుర్తించింది. అయితే వారిపై ఎటువంటి చర్యలనూ ఆ పార్టీ తీసుకోలేదు.
మోసంలో పలువురి పాత్ర
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బిజెపి అధ్యక్షులు లాలం వెంకటరమణారావు ఇటీవల సిఐడి అధికారులకు ఇచ్చిన మూడు పేజీల రిపోర్టులో తాను నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన రూ.35,96,670ను సుధా కర్‌కు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రాజెక్టు 30 ఏళ్లు వుంటుందని, కొంతకాలం పని చేస్తే పర్మినెంట్ చేస్తారని సుధాకర్ చెప్పాడని ఆ రిపోర్టులో వివరించాడు. ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఉద్యోగాల నిమిత్తం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఆడియోలు, శాసనసభ స్పీకర్, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, పశ్చిమ గోదావరి జిల్లా ఎంపి ఆశీస్సులు ఉన్నాయని సుధాకర్ చెప్పినట్లు రిపోర్టులో పేర్కొన్నాడు. ఉద్యోగాల కోసం కేంద్ర మంత్రి సిఫార్సు లెటర్ సుధాకర్‌కు ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఈ పరిచయాలతో కేంద్రమంత్రికి బినామీల పేర సుధాకర్ భూమి కొన్నట్లు ప్రచారం సాగుతోంది.
నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లుచేసిన వారు దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు జారీ చేస్తున్న విషయం ఏడాది క్రితం వెలుగులోకి తీసుకొచ్చిన 'ప్రజాశక్తి'ని బాధితులు అభినందించారు. విషయం వెలుగులోకి వచ్చిన తరువాత మేలుకుంటే ఇంతంగా నష్టపోయేవాళ్లం కాదని వాపోయారు. మోసానికి పాల్పడిన వారందిరిపైనా కేసులు నమోదుచేసి, మోసపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.










