Oct 04,2023 21:05

ప్రథమార్థంలో 26శాతం క్షీణత
ఇష్యూకు వచ్చిన 31 కంపెనీలు..
ముంబయి : భారత్‌లో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) ద్వారా సమీకరించే నిధులు మందగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ కాలంలో 31 కంపెనీలు రూ.26,300 కోట్ల నిధులు సమీకరించాయి. 2022-23 ఇదే ప్రథమార్థం (హెచ్‌1)లో కేవలం 14 కంపెనీలు ఇష్యూకు రావడం ద్వారా రూ.35,456 కోట్ల కోట్ల నిధులను పొందాయి. 2022-23 హెచ్‌1లో లిస్టింగ్‌ తేది.. ముగింపు ధర ఆధారంగా సగటు లిస్టింగ్‌ లాభం 11.56 శాతంతో పోల్చితే గడిచిన హెచ్‌1లో 29.44 శాతానికి పెరగడం విశేషం. ప్రైమ్‌ డేటాబేస్‌ రిపోర్ట్‌ ప్రకారం.. గడిచిన ప్రథమార్థంలో ఐపిఒకు వచ్చిన భారత కంపెనీలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నిధుల సమీకరణలో 26 శాతం పతనం చోటు చేసుకుంది. ''గత ఆరు నెలల్లో బహుళ రంగాలకు చెందిన కంపెనీలు ఐపిఒ మార్కెట్‌కు వచ్చాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా (బిఎఫ్‌ఎస్‌ఐ) రంగానికి చెందిన కంపెనీలు కేవలం రూ. 1,525 కోట్ల నిధులను సమీకరించాయి. మొత్తం నిధుల్లో వీటి వాటా 6 శాతంగా ఉంది.'' అని ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రణవ్‌ హల్దియా పేర్కొన్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ సంస్థలు గతేడాది ఇదే కాలంలో సేకరించిన నిధులలో 61 శాతం వాటాను కలిగి ఉన్నాయి.