Jul 18,2023 08:46

'అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటున్నారు.. చదువులోనూ, ఆటల్లోనూ హవా కొనసాగిస్తున్నారు..' అంటూ ఆడపిల్లల గురించి చాలామంది భావిస్తుంటారు. కాని కొన్ని క్రీడల వైపు ఆడపిల్లలు కన్నెత్తి కూడా చూడడం లేదు అంటున్న ప్రముఖ స్కేట్‌ బోర్డర్‌ అటితా వర్గీస్‌ 21 ఏళ్ల వయసులోనే 2015 నుండి 'గర్ల్స్‌ స్కేట్‌ ఇండియా' పేరుతో స్కేటింగ్‌ క్రీడలో అమ్మాయిలను, మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్‌లైన్‌ కమ్యూనిటీని నిర్వహిస్తున్నారు.

1122

బెంగుళూరుకు చెందిన అటితా 'నేను స్కేటింగ్‌ నేర్చుకునేటప్పుడు ఆట మీద దృష్టి పెట్టి సాధన చేశాను. మగపిల్లలతో కలిసి శిక్షణ తీసుకునేదాన్ని. అయితే కొద్ది కాలానికి నా చుట్టూ వున్న వాళ్లను గమనించడం మొదలుపెట్టాను. మా బృందంలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. చాలా కాలం నుండి నేనొక్కదాన్నే ఉన్నాను. ఈ పరిస్థితి ఒక్కోసారి నన్ను ఒంటరిపాటుకు గురిచేసేది. ఎంతో ఒత్తిడితో ఉండేదాన్ని' అంటూ తన ప్రయాణం తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. మన దేశంలో ఎంతోమంది స్కేట్‌బోర్డర్లు ఉన్నారు. అటితా మొదటిసారి నేర్చుకున్న అమ్మాయీ కాదు. ఆమెకు ముందు చాలామందే ఉన్నారు. కానీ అటితా ప్రత్యేకమైన వ్యక్తి. తనతో పాటు మరింత మంది అమ్మాయిలను ఈ ఆటవైపు తీసుకురావాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆమె ప్రతిభ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాకు చెందిన స్కేట్‌బోర్డర్‌ షూ ఉత్పత్తిదార కంపెనీ అటితాకు స్కేటింగ్‌ షూ స్పాన్సర్‌ చేస్తోంది. ఈ అవకాశం దక్కించుకున్న దేశంలోనే ఏకైక స్కేట్‌ బోర్డర్‌ ఆమె.
 

                                                                     స్వేచ్ఛగా.. సృజనాత్మకంగా ..

బాల్యం నుండే ఆటలంటే ఆసక్తి చూపించే అటితాకి, స్కూలు తరపున పలు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 19 ఏళ్ల వయసప్పుడు తన స్నేహితుల ద్వారా ఆమెకి స్కేటింగ్‌ పరిచయమైంది. 'మొదటిసారి స్కేట్‌ బోర్డర్‌పై కాలు పెట్టినప్పుడు నేను దాన్ని చాలా ఇష్టపడ్డాను. స్వేచ్ఛగా కదులుతూ సృజనాత్మకంగా ఆడే క్రీడగా ఇది నన్ను తెగ ఆకర్షించింది. అప్పటి నుండి నేను వెనక్కు తిరిగి చూడలేదు' అంటున్న అటితా 2013లోనే మొట్టమొదటి ఉచిత స్కేట్‌ పార్క్‌ని నిర్మించడంలో సహాయం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆమె ఆధ్వర్యంలో పదికి పైగా స్కేట్‌ పార్క్‌లు నిర్మించారు.

334


                                                                            ఆన్‌లైన్‌ వేదికగా..

'ఈ క్రీడవైపు ఆడపిల్లలను రప్పించడం కోసమే 2015 నుండి 'గర్ల్స్‌ స్కేట్‌ ఇండియా'ను ప్రారంభించాను. నేనొక్కదాన్నే స్కేటింగ్‌ చేస్తే ప్రయోజనమేముంది. ఎక్కువమంది అమ్మాయిలు ఈ క్రీడలోకి రావాలి. అదే నా లక్ష్యం. ఈ ప్రయాణంలో నేను విజయం సాధిస్తున్నాను' అంటూ గర్వంగా తన ఆన్‌లైన్‌ కమ్యూనిటీ గురించి చెబుతున్నారు. సోషల్‌మీడియా వేదికలో నిర్వహించే ఈ కమ్యూనిటీ పేరుతో పోస్టు చేసిన ఇన్‌స్టా వీడియోలు చూస్తే అటితా సాధించిన ఘనత మనకు అర్థమవుతుంది.

556


                                                                      మాలాంటి వారికి రోల్‌ మోడల్‌..

'నేను 2018లో బెంగుళూరులో జరుగుతున్న స్కేటింగ్‌ కాంపిటీషన్‌కు హాజరయ్యాను. అక్కడ అటితాను కలిశాను. ఆటలో ఎన్నో మెలకువలు చెప్పింది. స్ట్రీట్‌ స్టైల్‌ స్కేటింగ్‌లో ట్రిక్స్‌ నేర్పించింది. ఆమె ఓ గొప్ప క్రీడాకారిణిగానే కాదు, ఎంతోమంది మహిళలను తీర్చిదిద్దుతూ నాలాంటి వారికి రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారు' అంటూ అటితా గురించి గొప్పగా చెబుతున్నారు పూణెకి చెందిన స్కేట్‌ బోర్డర్‌ శ్రద్ధ గైక్వాడ్‌.
 

                                                                         మగరాయుడి వేషమన్నారు..

'ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆడపిల్లలు క్రీడలవైపు రావాలంటే ఎన్నో అడ్డంకులు అధిగమించాలి. అమ్మానాన్న నన్ను ఆటలవైపు ప్రోత్సహించినా సమాజంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదురయ్యాయి. జుట్టు కత్తిరించుకున్న నన్ను చూసి చాలామంది నువ్వు అమ్మాయివా.. అబ్బాయివా అని ముఖం మీదే అడిగేవాళ్లు. ఒకసారి ఒకతను.. నువ్వు ఈ మగరాయుడి వేషం మానేసి, అమ్మాయిలా జుట్టు పెంచు, వాళ్లు ధరించే బట్టలు వేసుకో.. అలా ఉంటేనే నిన్ను చూసైనా మరింతమంది అమ్మాయిలు ఇటువైపు వస్తారని చెప్పాడు. ఈ జనాలకి అమ్మాయిల శక్తిసామర్థ్యాలు కనిపించవు. వాళ్ల దుస్తులు, అలంకరణే గుర్తుకొస్తుంది. స్కేట్‌ బోర్డర్‌గా అమ్మాయిలు రాణించడం కూడా వీళ్లకి ఇష్టం ఉండదు. అందుకే చెత్త కామెంట్లు చేస్తుంటారు' అంటూ గతంలో తనకెదురైన అనుభవాన్ని చెబుతున్న అటితా దేశవ్యాప్తంగా ఉచితంగా పలు స్కేట్‌బోర్డింగ్‌ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు.
 

                                                                ఈ ప్రయాణం కొనసాగుతుంది..

స్కేటింగ్‌లో నైపుణ్యం సాధించాలంటే ఎగుడుదిగుడుగా ఉండే వివిధ ఉపరితలాల్లో, వీధుల్లో సాధన చేయాలి. కాని మన దేశంలో అటువంటి అవకాశాలు తక్కువ. స్కేట్‌ పార్కుల కొరత ఎక్కువగా ఉంది. నాలాంటి వారు చేస్తున్న కృషి ఫలితంగా ఇప్పుడిప్పుడే స్కేటింగ్‌వైపు అమ్మాయిలు వస్తున్నారు. ఇది చాలదు. మున్ముందు మరిన్ని ప్రయోజనాల దిశగా మా ప్రయాణం కొనసాగించాలి' అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అటిత.