- తేమ, తాలుతో పేరుతో దగా
- దండుకుంటున్న రైస్‌మిల్లర్లు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షంతో తుడిచిపెట్టుకుపోతుంటే అన్నదాత కంట కన్నీరు ఆగడం లేదు. తడిచిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో ఉన్న పంటనైనా రక్షించుకునేందుకు కష్టించి ఒడ్డుకు చేర్చారు. ధాన్యాన్ని అమ్ముకుందామని ఆర్‌బికెల ద్వారా మిల్లర్లులకు తరలిస్తే తాలు, తేమ పేరుతో అన్నదాతను నిలువునా దోచేస్తున్నారు. క్వింటాకు ఆరు కిలోల చొప్పున తరుగు తీస్తుండటంతో రైతు గుండె తరక్కుపోతుంది. కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు..అకాల వర్షాలను ఎదుర్కొని మిల్లులకు తరలిస్తే దక్కే ప్రయోజనం ఇదా అని రైతులు చెమ్మగిల్లుతున్నారు. ప్యాడీ క్లీనర్లను లేకపోవడం, ఉన్న వాటికి మరమ్మతులు అధికారులు చేయకపోవడంతో మిల్లర్లు యదేచ్ఛగా దోచుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేశారు. 87వేల ఎకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్ రకం, 53 వేల ఎకరాల్లో బొండాలు, ఇతర రకాల పంటలు సాగు చేశారు. 330 ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 140 రైస్ మిల్లులు ఉండగా వాటిలో 40 రైస్ మిల్లుల్లో మాత్రమే డ్రయర్‌లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తాలు తీయకుండానే మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మిల్లర్లు తాలు పేరిట క్వింటాకు ఆరు కేజీలు తగ్గిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్‌బికెల వద్ద కొలిచిన ధాన్యం రైస్ మిల్లుకు చేరుకునే సరికి వ్యత్యాసం కన్పిస్తుంది. ఇదేంటని ప్రశ్నిస్తే తేమను సాకుగా చూపుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
అధికారులతో మిల్లర్లు కుమ్మక్కు
ఆర్‌బికెల్లో ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచకుండా, పాడైన వాటికి మరమ్మతులు చేయకుండా అధికారులతో మిల్లర్లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేయాలని, దళారులు, మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
తేమ, తాలుపేరుతో తరుగు
ఈ ఏడాది 10 ఎకరాల్లో వరి సాగు చేశాను. 48 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. తాడేపల్లి గూడెంలోని ఓ రైస్ మిల్లుకు మ్యాపింగ్ ఇచ్చారు. మ్యాపింగ్ ఇచ్చిన ఐదు రోజులకు బండి వచ్చింది. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని, తాలు ఉందని క్వింటాకు ఆరు కేజీల చొప్పున తరుగు తీశారు. గతి లేని పరిస్థితుల్లో అంగీకరించాను. రవాణా ఛార్జీలు కలిపి అక్షరాలా రూ.22వేలు చెల్లించిన తర్వాతే రైస్ మిల్లు యాజమాన్యం ధాన్యం దిగుబడి చేసుకుంది. మిల్లు పట్టేందుకు సమయం పడుతుందని, నూక శాతం ఉంటే మళ్లీ తరుగు తీస్తామని చెప్పారు.
- పాతూరు సత్యనారాయణ, అచ్చెన్నపాలెం, నల్లజర్ల మండలం
ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు సమకూర్చాలి
స్థానిక ఆర్‌బికె ద్వారా కొంత ధాన్యాన్ని అనపర్తి మండలం పెడపర్తిలో రైస్ మిల్లుకు ధాన్యం తరలించాను. తేమ, తాలు, నూక శాతం ఎక్కువగా ఉందని క్వింటాకు ఆరు కేజీల చొప్పున తరుగు తీసుకున్నారు. సుమారుగా ఒక టన్ను ధాన్యం నష్టపోయాను. డ్రయర్‌లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులోకి తీసుకురావాలి.
- గిద్దారాయుడు కౌలు రైతు దుళ్ల గ్రామం,
కడియం మండలం










