- అధికారిక కార్యక్రమాలలో బిజెపికి ప్రధాని పరోక్ష ప్రచారం
- కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారిక యంత్రాంగాలు
- ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే టార్గెట్
- మోడీ వ్యవహారశైలిపై ప్రతిపక్షాల ఆగ్రహం
- తప్పుబడుతున్న రాజకీయ విశ్లేషకులు, నిపుణులు
న్యూఢిల్లీ : బిజెపి ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగపడేలా ప్రధాని పర్యటనలు జరపడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవలి కాలంలో నిర్వహించిన ఆరు కార్యక్రమాలకు రూ.151 కోట్ల ప్రజల సొమ్మును ఖర్చు చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. భారత్ బయోటెక్‌లో కొనసాగుతున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ను సమీక్షించేందుకు ప్రధాని మోడీ నవంబర్ 29, 2020న కేవలం ఒక గంట పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చారు. 2020 నవంబర్ 26న ప్రధాని పర్యటన, షెడ్యూల్‌ను హైదరాబాద్ పోలీసులు మీడియాకు మూడు రోజుల ముందు మాత్రమే ధృవీకరించారు. అయితే, మోడీ పర్యటించిన సమయం మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఆ సమయంలో హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల కోసం అధికార భారత రాష్ట్ర సమితి (అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి), ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు దూకుడుగా ప్రచారం చేశాయి. అలాంటి సమయంలో మోడీ ఎలాంటి ప్రసంగాలు చేయనప్పటికీ, తెలంగాణలోని టీవీ ఛానెల్‌లు, సోషల్ మీడియా మోడీ పర్యటనపై ఫోకస్ చేశాయి. దీంతో మోదీ 'అధికారిక' పర్యటన బీజేపీకి ఉద్దేశించిన అనధికారిక ప్రయోజనం చేకూర్చినట్టు బీఆర్‌ఎస్ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులు అన్నారు. మోడీ నిత్యం ఎన్నికల యావలోనే ఉంటారనేది రహస్యమేమీ కాదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు.. ప్రతి ఎన్నికలలో కుదిరితే ప్రత్యక్షంగా, కుదరకపోతే పైన పేర్కొన్న విధంగా అధికారిక కార్యక్రమాలను ప్రచార వేదికగా మలచుకుంటారని అన్నారు. మోడీ అధికారిక పర్యటనల సమయం, ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, వాటికయ్యే ప్రభుత్వ ఖర్చు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మోడీ పర్యటనలకు అయిన ఖర్చు (పలు వార్త పత్రికల కథనాల ఆధారంగా)
- మోడీ నగర పర్యటనకు సంబంధించి బెంగళూరు పౌర సంఘం రూ.24 కోట్లు ఖర్చు చేసింది.
- మోడీ యోగా దినోత్సవ సందర్శనకు కర్నాటక పుర, నగరపాలక సంస్థలు రూ.56 కోట్లు వెచ్చించాయి.
- కర్నాటకలోని కలబురగిలో కొన్ని గంటల పర్యటనకు రూ. 11.18 కోట్లు ఖర్చు చేశారు.
- బెలగావిలో ప్రధాని మోడీ ఈవెంట్ కోసం దాదాపు రూ. 14 కోట్లు ఖర్చు అయింది.
- ఫిబ్రవరి 27న ప్రధాని పర్యటన సందర్భంగా కర్నాటక ప్రభుత్వం రూ. 36.43 కోట్లు ఖర్చు చేసింది.
- ఐఐటీ-ధార్వాడ్ ప్రారంభోత్సవం కోసం రూ. 9.5 కోట్లు వెచ్చించారు.
ప్రారంభోత్సవాల 'ప్రచారం'
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత తొమ్మిదేండ్లలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికల ప్రచారాల విషయంలో ఆయన అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు నెలల్లో అతను అధికారి ప్రారంభోత్సవాల పేరిట పర్యటించి, రాజకీయంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి ప్రసంగించటం వంటివి చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్నాటకలో ప్రధాని చేసిన ఈ ప్రారంభోత్సవాలు.. బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అదనమని తెలిపారు. అయితే ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రధాని కచ్చితంగా ప్రారంభోత్సవాలు వంటివి చేస్తారని అన్నారు. బెంగుళూరులోని బయ్యప్పనహళ్లిలో సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ ప్రారంభోత్సవం దీనికి ఒక ఉదాహరణ. ఇది మార్చి 2021లో సిద్ధంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నప్పటికీ, జూన్ 2022లో ఒక ప్రచార కార్యక్రమంలో మోడీ దీనిని ప్రారంభించటం గమనార్హం.
- ఈ ఏడాది మార్చి చివరి వారంలో, బెంగళూరు మెట్రో యొక్క పర్పుల్ లైన్ ప్రారంభోత్సవం పనులు ఇంకా పూర్తి కానప్పటికీ దానిని అధికారిక కార్యక్రమంగా మోడీ మార్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడంతో మోడీ సాధారణ ఆర్భాటాలతో మెట్రో రైడ్‌ను చేపట్టారు. అయితే, పనులు సరిగ్గా జరగకపోవడంతో అందులో చాలా సమస్యలు ఏర్పడ్డాయి.
- బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను మోడీ ప్రారంభించడం కూడా ఇలాంటి విమర్శలకే దారితీసింది. ప్రచారం జరిగిన మూడు రోజుల తర్వాత, వర్షాల కారణంగా దెబ్బతిన్న ఎక్స్‌ప్రెస్‌వేలోని రోడ్ల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
- దేశ ప్రధాని హౌదాలో అర్హత లేని ప్రాజెక్టులను మోడీ ప్రారంభించడం అనేక సందర్భాల్లో కనిపించింది. ప్రభుత్వం, పార్టీ సరిహద్దులను చెరిపివేస్తూ అధికారిక, పార్టీ కార్యక్రమాలను ఆయన కలిపి నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు.
- బీజేపీ ప్రచారకర్తగా మాండ్యాలో నిర్వహించిన భారీ రోడ్‌షో కోసం అయిన మొత్తం ఎవరు చెల్లించారని కర్నాటకలో ప్రజలు చర్చించుకోవటం చర్చనీయాంశంగా మారింది. అదే రోజు, మోడీ అధికారిక కార్యక్రమం అయిన ధార్వాడ్‌లో ఐఐటీ క్యాంపస్‌ను కూడా ప్రారంభించారు. అయితే బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజలను తీసుకువెళ్లడం చర్చకు దారి తీసింది.
కర్ణాటకలో ప్రచారం కోసం అధిక సమయం
అయితే 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత ఒక ఏడాదిలో అత్యధిక కాలం గడిపిన రాష్ట్రం కర్ణాటకే కావటం గమనార్హం. ఈ సంవత్సరం జనవరి 12 నుంచి ప్రారంభించి, మోడీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు కర్నాటకను సందర్శించారు. మార్చి 29న కర్నాటక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ప్రకటించకముందే ఆ నెలలో మోడీ రెండుసార్లు రాష్ట్రాన్ని సందర్శించారు. మార్చి 29న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత కూడా మోడీ కర్నాటకకు తరచుగా పర్యటనలు కొనసాగించారు. టైగర్ ప్రాజెక్ట్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో వివిధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏప్రిల్ 9న ఆయన రాష్ట్రాన్ని సందర్శించారు. ప్రధాని పర్యటన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. గతంలో వరదలు వచ్చినపుడు రాష్ట్రానికి సాయం చేయని మోడీ.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కర్నాటకలో పర్యటిస్తున్నారని ఆరోపించింది.
బొమ్మై నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఐఐటీ-ధార్వాడ్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం ప్రజలను రవాణా చేయడం, భోజనాలు, స్టేజ్ సెటప్‌లు, బ్రాండింగ్, ప్రమోషన్లు, ఇతర లాజిస్టిక్‌ల కోసం రూ.9.49 కోట్లు ఖర్చు చేసిందని ఆర్‌టిఐ సమాధానాలు వెల్లడించాయి. దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ప్రజల సొమ్మును అధికారక కార్యక్రమాల పేరిట సొంత ప్రచారానికి వాడుకోవడమేంటని ప్రశ్నించాయి.
ఆ ఐదు రాష్ట్రాల్లోనూ ఇదే వ్యూహం
త్రిపురలో ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు కాషాయ పార్టీని ఆందోళనకు గురిచేశాయి. ఎంసీసీ అమల్లోకి రావడానికి దాదాపు నెల రోజుల ముందు డిసెంబర్ 18న మోడీ త్రిపురలో రూ.4,350 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ. 3,400 కోట్లతో కొత్తగా నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందించిన 'గహ ప్రవేశ్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అగర్తలా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అగర్తలా బైపాస్ (ఖేర్‌పూర్-అమ్తాలి) విస్తరణ ప్రాజెక్ట్‌ను మోడీ ప్రారంభించారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద జాతీయ రహదారి 8ని విస్తరించడం, 232 కి.మీ పొడవుతో 32 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం వంటి ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. 542 కిలోమీటర్ల మేర 112 రాష్ట్ర, జిల్లా రహదారుల ప్రాజెక్టులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
అలాగే, ఇదే ఏడాది ముగిసిన గుజరాత్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే మోడీ ప్రారంభోత్సవ ప్రచార కార్యక్రమాలు చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. జనం సొమ్ముతో మోడీ సర్కారు అధికారిక కార్యక్రమాలను ప్రచార కార్యక్రమాలు మార్చుకోవడం ప్రజాస్వామ్యంలో ఏ మాత్రమూ మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.










