Jul 07,2023 10:08
  • ఇ-పేమెంట్లలో భారాన్ని పెంచొద్దు
  • రాష్ట్రాలకు ఆర్‌బిఐ మార్గదర్శకాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగుల పింఛన్లకు సంబంధించి రాష్ట్రాలకు రిజర్వ్‌బ్యాంకు నుంచి సూచనలు వస్తున్నాయి. ఇ-చెల్లింపుల విధానంలో అనుసరించాల్సిన విధానాలు, పింఛన్ల చెల్లింపు పరిస్థితి వంటి అంశాలపై సూచనలు చేయడం విశేషం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను ప్రస్తావిస్తూనే ఏవి చేస్తే బాగుంటుందన్న కోణంలో కూడా నివేదిక సిద్ధం చేసింది. అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ బ్యాంకుల ద్వారానే పింఛను చెల్లింపులు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నేరుగా రిజర్వ్‌బ్యాంకు ద్వారా, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఖజానాల ద్వారా పింఛన్ల చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని మార్గదర్శకాలను కూడా రిజర్వ్‌బ్యాంకు సిద్ధం చేసింది. పింఛనుదారులకు టంఛనుగా పింఛను నగదు అందేలా చూడడంతోపాటు మొత్తం పింఛన్ల పంపకం ప్రక్రియకు ఒక సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేయాలన్న కోణంలో సూచనలు చేసింది. పింఛన్ల సవరణ, కరువు భత్యం వంటివి ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన విధానం, పింఛనుదారులను గుర్తించేందుకు డిజిటల్‌ విధానం అమలు ద్వారా డూప్లికేషన్‌ నివారణ, అధిక, తక్కువ పింఛన్లను అందించడంలో తేడాను తగ్గించడం, పింఛనుదారుల సమస్యను నివారించేందుకు గ్రీవెన్స్‌ మేనేజ్‌మెంటు అమలుపైనా సూచనలు చేసింది.
 

                                                                             'స్పార్ష్‌' విధానంపైనా..

పింఛన్ల చెల్లింపులో రక్షణశాఖ స్పార్ష్‌ అనే విధానాన్ని అమలు చేస్తోంది. అలాగే టెలీ కమ్యూనికేషన్‌ శాఖ కూడా తన శాఖలో సొంతంగా తయారుచేసుకున్న సంపన్న అనే విధానాన్ని అమలు చేస్తోంది. వీటిని ఒకే ప్లాట్‌ఫారంపై చెల్లింపులు చేస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నట్లు భావిస్తున్న రిజర్వ్‌ బ్యాంకు అదే తరహా చెల్లింపుల అమలుపైనా ఆలోచనలు చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పింఛను చెల్లింపులకు సంబంధించి అనేక ఫైళ్లను ఒకే ఇ-పేపెంట్‌ ఫైలులో పంపిస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంకు గుర్తించింది. సాధారణంగా ఒక ఇ-పేమెంట్‌ ఫైల్‌లో 50 ట్రాన్సాక్షన్ల కన్నా ఎక్కువ పంపిస్తే సమస్యలు వస్తాయని రిజర్వ్‌బ్యాంకు భావిస్తోంది. దీనివల్ల నెట్‌ ట్రాఫిక్‌లో కూడా అంతరాయాలు వస్తాయన్న భావాన్ని వ్యక్తం చేస్తున్న రిజర్వ్‌బ్యాంకు.. రాష్ట్రాలు ఆ తరహా భారీ ట్రాన్సాక్షన్లు తగ్గించుకోవాలని సూచించింది.