Nov 06,2023 10:48
  • కేంద్ర ప్రభుత్వ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
  • రూ.20,000 జరిమానా

న్యూఢిల్లీ : భారత స్వాతంత్య్ర సమరయోధుడు ఉత్తమ్‌ లాల్‌ సింగ్‌(96) తన పెన్షన్‌ కోసం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఆయనకు పింఛన్‌కు మార్గం సుగమమైంది. ఇది ''విచారకరమైన పరిస్థితి'' అని కోర్టు పేర్కొన్నది. భారత ప్రభుత్వం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రానికి న్యాయస్థానం రూ.20,000 జరిమానా విధించింది. స్వాతంత్య్ర సమరయోధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడి పట్ల భారత ప్రభుత్వ తీరు బాధాకరమని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ''1980 సంవత్సరం నుంచి సింగ్‌ స్వాతంత్రత సైనిక్‌ సమ్మాన్‌ పెన్షన్‌ను సంవత్సరానికి 6 శాతం వడ్డీతో 12 వారాల్లోగా విడుదల చేయాలి'' అని కేంద్రాన్ని అందులో ఆదేశించారు. అంతేకాకుండా, కేంద్రంపై కోర్టు రూ. 20,000 జరిమానా విధించింది. 1985లో బీహార్‌ ప్రభుత్వం సిఫారసు చేసిన పిటిషనర్‌ కేసులో భాగమైన సింగ్‌ పత్రాలను కేంద్రం కోల్పోయిందని కోర్టు పేర్కొన్నది. 1927లో జన్మించిన సింగ్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అతను బ్రిటీష్‌ ప్రభుత్వంచే నిందితుడిగా చేయబడ్డారు. అతను 1982, మార్చిలో స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2017 నవంబర్‌లో హౌం మంత్రిత్వ శాఖ తన వద్ద సింగ్‌ రికార్డులు లేవని బీహార్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసును అధికారులు పరిష్కరించకపోవడంతో సింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు.