
ధర్మవరం (వైజాగ్) : ప్రభుత్వ ఉద్యోగం ఉందంటూ.. ఓ వృద్ధురాలికి పింఛన్‌ను ఆపేశారు. ఏ ఆధారం లేని ఆ వృద్ధురాలు పింఛన్ కూడా అందకపోవడంతో అవస్థలు పడుతోంది. బుధవారం స్థానికులతో కలిసి వృద్ధురాలు ధర్మవరం అగ్రహారం గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ధర్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన 62 సంవత్సరాలు నిండిన నిరుపేదరాలు కూండ్రపులి బంగారమ్మకు భర్త చనిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగించింది. ఇటీవల వయసురీత్యా పనులకు కూడా వెళ్లలేక ఆగిపోయింది. ఈక్రమంలో గత 16 నెలల నుండి వృద్ధురాలికి అందాల్సిన పింఛన్ ఆగిపోయింది. కారణమడిగితే... ప్రభుత్వ ఉద్యోగం ఉందని, జీతం అందుకుంటుందని అందుకే పెన్షన్ ఆపేశామని చెబుతున్నారంటూ వృద్ధురాలు వాపోయింది. పని చేసే శక్తి లేక, ఏ ఆధారం లేని ఆ వృద్ధురాలు.. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, పింఛన్ వచ్చేలా సాయం చేయాలని వేడుకుంటోంది. గత 16 నెలలుగా పింఛన్ కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని కంటతడిపెట్టింది. ఈరోజు స్థానికులు, ఆ వృద్ధురాలు కలిసి ధర్మవరం అగ్రహారం గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు.