Aug 14,2023 07:45

కాసిన్ని అక్షరాలైనా కూడగట్టుకుని
ఆయుధాలై నిప్పుకణికల్ని విరజిమ్మాలి
కాసిన్ని గొంతులైనా నినాదాలై
దిక్కులు ప్రతిధ్వనులై పిక్కటిల్లాలి
కాసిన్ని పాదాలైనా లాంగ్‌మార్చ్‌ చేసి
పదఘట్టనల ఫిరంగులై హోరెత్తించాలి
కాసిన్ని సంఘీభావాల సానుభూతులు
ఇంటింటా నిరసన పళ్ళాలై మోగాలి
మౌనమేలనోయీ ...

అది-
రాజకీయమైతే దానికో హద్దుండాలి
మతజ్వాలలైతే లౌకికతత్వం అద్దాలి
డ్రగ్స్‌ మాఫియా దురంతమైతే తుదముట్టించాలి
సంపద్వంత ఖనిజాలై పసిడి రాశులైతే రక్షించుకోవాలి
జాతిహననాలు విద్వేషపూరిత అసహనాలు
సమైక్యతా రాగాల గొంతుల్ని నులుముతాయి
మౌనమేలనోయీ ...

నిశ్శబ్దం పెను శబ్దమై
మైదానాలూ లోయలూ
కొండల్ని నుసి చేస్తున్నాయి
ధనమాన ప్రాణాల్ని హరిస్తున్నాయి
ఏదో ఒకటి చేయి... సమయం మీరకుండా
మణిపూరు- దేశం కంఠాన మణిహారమై వెలగాలి
మౌనమేలనోయీ...
 

- దాట్ల దేవదానం రాజు
94401 05987