Dec 26,2022 09:59
  • విధుల్లో నుంచి తొలగింపు.. యుపిలో దారుణం

లక్నో : జాతీయ గీతానికి బదులుగా ప్రముఖ కవి మహ్మద్‌ ఇక్బాల్‌ రచించిన 'లాబ్‌ పే ఆతి హై దౌ' అనే ఉర్దూ గీతం విద్యార్థులు పాడినందుకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌, శిక్షా మిత్రను అరెస్టు చేయడంతోపాటు, విధుల్లోంచి తొలగించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో జరిగింది. మిర్ధాన్‌ ఫరీద్‌పూర్‌ పాఠశాలలో ఉదయం అసెంబ్లీ సమయంలో విద్యార్థులు జాతీయగీతానికి బదులుగా ప్రముఖ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ రచించిన గీతాన్ని పాడారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటనపై విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో, పాఠశాల శిక్షా మిత్రగా పనిచేస్తున్న 55 ఏళ్ల వాజీరుద్దీన్‌ను శుక్రవారం అరెస్టు చేసి, జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. పాఠశాల విద్యా శాఖ వాజీరుద్దీన్‌ను విధుల నుంచి తొలగించింది. ఈ ఘటన సమయంలో ప్రిన్సిపాల్‌ నహిద్‌ సిద్ధికీ సెలవులో ఉన్నారు. అయినా సిద్ధికీని కూడా పోలీసులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. సిద్ధికీ, వాజీరుద్దీన్‌పై ఐపిసిలోని సెక్షన్లు 298, 153 కింద కేసు నమోదు చేశారు. జాతీయ గీతానికి బదులుగా ఉర్దూ గీతం పాడటం అరెస్టు చేసేంత నేరమా? అన్న విలేకరుల ప్రశ్నకు జిల్లా ఎస్‌పి (గ్రామీణం) రాజ్‌కుమార్‌ అగర్వాల్‌ వివరణ ఇచ్చారు. 'హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు అరెస్టు చేశాం' అని ఎస్‌పి తెలిపారు. సంఘటన వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపినట్లు చెప్పారు. ప్రిన్సిపాల్‌ సిద్ధికీని ఇప్పటికే సస్పెండ్‌ చేసినట్లు జిల్లా విద్యాధికారి వినరు కమార్‌ తెలిపారు. వాజీరుద్దీన్‌ 2007 నుంచి శిక్షా మిత్రగా పనిచేస్తున్నారు. కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న ఆయన అరెస్టు కావడంతో, మరో ఆధారం లేక ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.