- మహిళల రైఫిల్-3 పొజిషన్, 25మీ. పిస్టోల్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణం
- హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్‌కు రెండు పతకాలు
హాంగ్జౌ: 19వ ఆసియా క్రీడల్లో నాల్గోరోజు భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల 50మీ. రైఫిల్-3 పొజిషన్‌లో సిఫ్ట్ కౌర్ శర్మ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. బుధవారం జరిగిన పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్, మహిళల 25మీ. పిస్టోల్ టీమ్ విభాగాల్లో నాల్గోరోజు భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కాయి. పురుషుల స్కీట్‌లో అనంత్‌జీత్ సింగ్, మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ టీమ్, మహిళల వ్యక్తిగత 25మీ. పిస్టోల్ విభాగంలో ఈషా సింగ్ రజత పతకాలను సాధించారు. అలాగే మహిళల 50మీ. రైఫిల్-3 పొజిషన్‌లో భారత్‌కు మరో రజతం దక్కింది. పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్, పురుషుల 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్‌తోపాటు మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్‌లో రమిత కాంస్య పతకాలను సాధించారు. సెయిలింగ్ ఐఎల్‌సీఏ 7 విభాగంలో విష్ణు శరవణన్ కాంస్యం సాధించాడు. నాల్గోరోజు భారత్‌కు దక్కిన పతకాల్లో సెయిలింగ్ మినహా.. మిగతా పతకాలన్నీ షూటింగ్‌లో వచ్చాయి.
మెరిసిన ఈషా సింగ్...

హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ షూటింగ్‌లో మెరిసింది. మహిళల 25మీ. పిస్టోల్ విభాగంలో స్వర్ణం కైవసం చేసుకోగా.. వ్యక్తిగత 25మీటర్ల పిస్టోల్ విభాగంలో రజత పతకాన్ని ఒడిసిపట్టుకుంది. 25మీ. పిస్టల్ విభాగంలో మను బాకర్, రిథిమ్ సంగ్వాన్, ఈషా సింగ్‌లతో కూడిన భారత మహిళల జట్టు 1759 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.
సెయిలింగ్‌లో విష్ణు శరవణన్‌కు కాంస్యం

సెయిలింగ్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల డింగీ ఐఎల్‌సిఏ-7 విభాగంలో 24 ఏళ్ల విష్ణు శరవణన్ 34 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. సింగపూర్ సెయిలర్‌లో జున్ హాన్ ర్యాన్ స్వర్ణం, దక్షిణకొరియా సెయిలర్ జీమిన్ రజత పతకాలు సాధించారు. పురుషుల విండ్ సర్ఫర్ ఈవెంట్‌లో మరో సెయిలర్ ఇబాద్ అలీ కాంస్యం ఖాయం చేశాడు. ఈ రేసులో 52 పాయింట్లతో ఇబాద్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.











