Apr 28,2023 21:12

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసి) నూతన ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు. ఈ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా సంస్థకు ఆయన 2024 జూన్‌ 29 వరకు సేవలందించనున్నారు. ఆ తర్వాత జూన్‌ 2025 వరకు ఎల్‌ఐసి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనగనున్నారు. 2025 జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఎల్‌ఐసిలో నలుగురు ఎండిల్లో ఒకరైన సిద్ధార్థ మొహంతిని ఇటీవల తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించింది. తాజాగా ఆయనకు పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధార్థ ఎల్‌ఐసిలో చేరక ముందు ఎల్‌ఐసి హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ఎండిగా ఉన్నారు. 2021 ఫిబ్రవరిలో ఎల్‌ఐసిలో ఎండిగా చేరారు. 1985లో ఎల్‌ఐసి డైరెక్ట్‌ రిక్రూట్‌ ఆఫీసర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. మూడు దశాబ్దాల నుంచి అనేక హోదాల్లో పని చేసిన విశేష అనుభవం కలిగి ఉన్నారు. పొలిటికల్‌ సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. అలాగే న్యాయశాస్త్రంలో పట్టాతో పాటు, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పిజి చేశారు.