Oct 25,2023 21:53
  • ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

 అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సత్తా చాటాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాటర్స్‌ జాబితాలో శుభ్‌మన్‌ గిల్‌ 823 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న బాబర్‌ అజామ్‌(పాకిస్తాన్‌) కంటే 6పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు. 24ఏళ్ల శుభ్‌మన్‌ వన్డేల్లో వేగంగా 2వేల పరుగులను పూర్తి చేసుకొని ర్యాంకింగ్స్‌లోనూ ఎగబాకుతున్నాడు. ఇక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్‌ 2వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. శుభ్‌మన్‌ తొలి రెండు వన్డేలకు దూరమైనా.. మిగిలిన మూడు మ్యాచుల్లో 95పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో గిల్‌ 53పరుగుల అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. ఇక బాబర్‌ అజమ్‌ 829రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నా.. వన్డే ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లో కేవలం 157పరుగులే చేశాడు. అలాగే చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో బాబర్‌ అజమ్‌ అత్యధికంగా 74పరుగులతో రాణించినా.. పాకిస్తాన్‌ జట్టు 8వికెట్ల తేడాతో ఓటమి సెమీస్‌ ఆశలను సంక్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ క్వింటర్‌ డికాక్‌ 3వ ర్యాంక్‌, హెన్రిక్‌ క్లాసెన్‌ 4వ ర్యాంక్‌లకు ఎగబాకారు. వన్డే ప్రపంచకప్‌లో డికాక్‌ 5ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలతో కదం తొక్కాడు. వీరిద్దరికీ కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌లో ఇదే.