Jul 16,2023 09:58
  • జార్జియాలో నలుగురి మృతి

వాషింగ్టన్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొడుతున్నది. సామూహిక హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ నెల4న ఒకే రోజు 10 మందిని కాల్చి చంపి, దాదాపు 40 మందిని గాయపరిచిన మూడు కాల్పుల ఘటనల నుంచి అమెరికా తేరుకోక ముందే జార్జియాలో తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం పట్టపగలు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంప్టాన్‌ పట్టణంలోని డాగ్‌వూడ్‌ లేక్స్‌ ఏరియాలో ఉదయం 10:45 గంటల సమయంలో కాల్పులు జరిగాయని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాల్పుల జరిపిన దుండగున్ని స్థానిక ప్రాంతానికే చెందిన 41 ఏళ్ల ఆండ్రీ లాంగ్‌మోర్‌గా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. మానవ హక్కుల గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికాలో సామూహిక హత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఈ ఏడాది మొదటి ఆరు మాసాల్లో 382 వరకు సామూహిక కాల్పులు జరిగాయి. 140 మందికిపైగా మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కాకుండా కనీసం నలుగురు మృతి చెందితే దానిని సామూహిక కాల్పులుగా పేర్కొంటారు.