Nov 15,2023 21:30

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఆరు రెట్ల వృద్థితో రూ.369 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.57 కోట్ల లాభాలతో పోల్చితే 550 శాతం వృద్థిని కనబర్చింది. ఇదే సమయంలో నాట్కో విక్రయాలు రూ.452 కోట్ల నుంచి 134.7 శాతం పెరిగి రూ.1,061 కోట్లకు చేరాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ విదేశాల్లో ఫార్ములేషన్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉండటం, దేశీయ ఆగ్రోకెమికల్‌ వ్యాపారం అంచనాలకు మించి రాణించడంతో ఫలితాల్లో భారీ వృద్థి చోటు చేసుకుంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతీ రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.1.25 చెల్లించడానికి ఆ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఎగుమతుల్లో 180 శాతం వృద్థితో రూ.792 కోట్లు, దేశీయ రెవెన్యూలో 10 శాతం పెరిగి రూ.103 కోట్ల చొప్పున ఆదాయాన్ని నమోదు చేసింది.