ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : భారత సెపక్ తక్ర శిక్షణ శిబిరానికి కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారుడు సి.శివకుమార్ ఆంధ్ర ప్రదేశ్ తరపున ఎంపికైనట్టు రాష్ట్ర సేపక్ తక్ర సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చాంబర్లో క్రీడా సీఈఓ సి.రమణ భారత శిక్షణ శిబిరానికి ఎంపికైన శివకుమార్‌ను పుష్పగుచ్చని అందించి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఈఓ రమణ మాట్లాడుతూ గతంలో భారత జట్టుకు మన రాష్ట్ర తరపున పాల్గొని బంగారు పతకాన్ని సాధించడం జరిగిందని అదే తరహాలో గోవాలో జరగనున్న జాతీయ సెపక్తక్రా శిక్షణ శిబిరంలో శివకుమార్ చక్కటి ప్రతిభను కనపరిచి భారత జట్టులో స్థానాన్ని సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించే వారికి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర సెపక్తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీ నుంచి 30 రోజులపాటు గోవాలో జరగనున్న భారత సెపక్తక్రా శిక్షణ శిబిరానికి మన జిల్లాకు చెందిన శివకుమార్ ఎంపిక రావడం గర్వకారణం అని ఇలాంటి క్యాంపులకు ఈ క్రీడాకారుడు పాల్గొనడం ఇది మూడోసారి ఈ క్యాంప్ అనంతరం ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని, అందులో మన జిల్లాకు చెందిన శివకుమార్ కచ్చితంగా ఉండడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన శిక్షకులు నటరాజ్, ఒలంపిక్ అసోసియేషన్ సీఈవో పి.విజయ్ కుమార్, రాష్ట్ర సేపక్ తక్ర సంఘం కార్యదర్శి జి. శ్రీనివాసులు, ఒలంపిక్ అసోసియేషన్ నిర్వహక కార్యదర్శి పి.సునీల్ కుమార్ పాల్గొన్నారు.










