Jul 21,2023 22:06

-ముగ్గురికి తీవ్ర గాయాలు
-పరిశ్రమ టన్నెల్‌ వద్ద కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి- పాణ్యం/కర్నూలు హాస్పిటల్‌ :నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌కో పరిశ్రమలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బీహార్‌ కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికుల కథనం ప్రకారం... గ్రీన్‌కో పరిశ్రమలో నాలుగో టన్నెల్‌ సాల్డ్‌ జోన్‌ పరిధిలో టన్నెల్‌ లోపలి భాగంలో పనులు జరుగుతుండగా ఒక్కసారిగా టన్నెల్‌ పైభాగం కుప్పకూలింది. ఈ సమయంలో టన్నెల్‌ లోపల పనులు చేస్తున్న బీహార్‌ రాష్ట్రం లవలాంగ్‌కు చెందిన మునేరిక్‌ (33), కర్నిబార్‌ గ్రామానికి చెందిన సోనుకుమార్‌ (20) మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వగా, వారిని అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్‌ ప్రాంతంలో పది మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. టన్నెల్‌ వద్ద నిరసన తెలిపారు. గ్రీన్‌కోకు చెందిన వాహనాలను, అంబులెన్స్‌ను ధ్వంసం చేశారు. కంపెనీ ప్రతినిధులు మీడియాను పరిశ్రమలోకి అనుమతించలేదు. గురువారం రాత్రి కూడా ఒక కార్మికుడు పొక్లెయినర్‌ తగిలి చనిపోయినట్లు సమాచారం. సరైన వసతులు కార్మికులకు కల్పించకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. నంద్యాల డిఎస్‌పి మహేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం, గడివేముల ప్రాంతాల నుండి పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు.