
ఎంపి, ఎమ్మెల్యేలకు అభివృద్ధి పట్టదా..? : సిపిఎం
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు (కర్నూలు) :రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిపిఎం నిర్వహిస్తున్న మహాపాదయాత్ర గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి, వెంకటాపురం, ఎస్‌ఎంఎల్ డిగ్రీ కళాశాల, అన్నమయ్య సర్కిల్ మీదుగా గోనెగండ్లకు చేరుకుంది. అంతకుముందు ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.గోవిందు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో వి.వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారని...తొమ్మిదేళ్లుపూర్తయినా రాష్ట్రానికి, వెనుకబడిన కర్నూలు ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు, ఎమ్మిగనూరు ప్రాంతానికి ఇచ్చిన హామీలను సిఎం విస్మరించారన్నారు. చేనేతలకు సబ్సిడీపై నూలు, ఇతర ముడి సరుకులు ఇవ్వడంతో పాటు వారు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్నప్పుడే చేనేతలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం బాగుపడాలంటే గురురాఘవేంద్ర ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌డిఎస్ కుడి కాలువ నిర్మాణం చేపట్టాలని, ఎల్‌ఎల్‌సి స్థిరీకరణ కోసం కర్ణాటక ప్రాంతంలో జలచౌర్యాన్ని నివారించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు అక్రమ ఇసుక వ్యాపారానికి, పేకాటకు, మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గన్నారు. కర్నూలు జిల్లా నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.