Jun 26,2023 07:11

అప్పుడెప్పుడో పొలాల్లో కలుపు తీయడానికో
పత్తి ఏరడానికో మిరపకాయ కొయ్యడానికో
మొదలైన నడక, ఇప్పటికీ నడుస్తూనే ఉంది
తనకోసం తనవాళ్లకోసం మొదలుపెట్టిన నడక
ఇప్పుడు లోకం కోసం నడుస్తూ ఉంది
రేపటి తన పిల్లల బాగుకోసం జనం బాగుకోసం
పొలం గట్ల మీంచి రోడ్డునపడి నడుస్తోంది
సద్దన్నంలో ఇంత పచ్చడి కలుపుకొనో
ఇన్ని మజ్జిగనీళ్లు పోసుకొనో తాగిన రోజుల్నుంచి
అలవాటైన నడకే అయినా
ఇప్పుడు మళ్లీ కొత్తగా నడుస్తోంది
ఎకరాల పొలాలు గజాలుగా మారాక
మట్టిని, తనని తవ్వుకుపోతున్న
సరికొత్త రాక్షసమూకల్ని ఎదుర్కోడానికి
అపర కాళికలా మళ్లీ నడుస్తోంది
గర్భవతని చూడకుండా పొట్టలో తన్నిన వాళ్ల
ఉసురు తీయడానికి
చేతిలో తప్పటడుగులు వేస్తున్న చిన్నారితో
గర్భంలో పుట్టుకకోసం ఎదురుచూస్తున్న
ఇంకో చిన్నారితో నడుస్తూనేవుంది
మోసకారి మాయలమరాఠి తేనె పూసిన కత్తి నుంచి
స్రవిస్తోన్న కన్నీటిని ఈదుకుంటు నడుస్తోంది
వాడు విసిరే మాటల బాణాలకు మరింత పదునెక్కి
తన లక్ష్యం వైపు సాగిపోతోంది
రంగు మార్చిన రాక్షసుల నిర్బంధాల నడుమ
వేసే ప్రతి అడుగూ బలంగా
రేపటిలోకే పడుతోంది
పిచ్చోడి చేతికి దొరికిన రాయి
తగలరాని చోట తగులుతున్నా
దు:ఖపు గాయాల్ని లెక్కచేయకుండా నడుస్తూనేవుంది
ఇనుపకంచెలు పరదాల చాటున
దాక్కుని నడిచే నడక కాదిది
కుట్రల్ని, కులాల కంపుల్ని, ముళ్ళకంపల్ని దాటుకుంటూ
ఒకే లక్ష్యంతో నడుస్తున్న నడక
జనం కోసం నడక
జనంతో నడక
 

- బండ్ల మాధవరావు